‘హైడ్రా’కు మరిన్ని పవర్స్.. కొత్త చట్టం తెచ్చే యోచనలో రేవంత్ సర్కార్

ManaEnadu:హైదరాబాద్‌లో చెరువులను చెరబట్టి, కుంటల్లో ఆకాశహర్మ్యాలు కట్టి, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా (Hyderabad Disater Response and Assets Protection Agency) ఉక్కుపాదం మోపుతోంది. లేక్ వ్యూలో ఉన్న మల్టీస్టోర్ బిల్డింగ్‌లోని బాల్కనీలో కూర్చొని హాయిగా కాఫీ సిప్ చేస్తూ వ్యూ ఎంజాయ్ చేసే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. లేక్ వ్యూ, లేక్ సైడ్ అంటే ఎంతో ఆసక్తి చూపే వినియోగదారులకు కూడా ఇప్పుడు ఆ పేరు వింటేనే దడ పుట్టేలా చేస్తోంది. ఆ ప్రాంతాల్లో ఇల్లు, స్థలం కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేలా చేస్తోంది.

23 ప్రాంతాల్లో 262 కట్టడాలు కూల్చివేత
చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న హైడ్రాకు బాస్‌గా ఐపీఎస్ రంగనాథ్ (Hydra) వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పక్కా వ్యూహంతో చడీచప్పుడు లేకుండా బడా బడా బుల్డోజర్లను తీసుకొచ్చి ఒక్కసారిగా ఆకాశాన్ని తాకేలా ఉన్న భవనాలను నేలమట్టం చేస్తున్నారు రంగనాథ్ (Ranganath). పేద, ధనిక, ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా అక్రమంగా నిర్మిస్తే చాలు ఆ కట్టడాలనే కూల్చేస్తున్నారు. కేవలం 74 రోజుల్లో 23 ప్రాంతాల్లో 262 కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. అలా ఇప్పటివరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా.

హైడ్రాకు జేజేలు
హైడ్రాకు అంతటా జేజేలు కొడుతున్నా.. సామాన్యుల ఇళ్లను కూడా కూల్చడం (Hydra Demolitions)తో కాస్త నెగిటివిటీ వస్తోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. హైడ్రా పరిధిని పెంచిన సర్కార్ దానికి చట్టబద్ధత తీసుకురావాలని యోచిస్తోంది. మరిన్ని అధికారాలు కల్పిస్తూ ప్రత్యేకంగా ఓ చట్టం తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

హైడ్రాకు మరిన్ని అధికారాలు
ఇందుకోసం తెలంగాణ (Telangana) భూ ఆక్రమణ చట్టం – 1905కు సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకురానుంది. రెవెన్యూ, నీటి పారుదల, పురపాలక, జీహెచ్‌ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్‌ సర్వీసెస్‌ తదితర శాఖలకు ఉన్న అధికారాలను చట్టం ద్వారా, కొన్ని ప్రత్యేక జీవోల ద్వారా ఉన్న అధికారాలను తాజాగా తెచ్చే ఆర్డినెన్స్‌ ద్వారా హైడ్రాకు అప్పగించనున్నట్లు తెలిసింది.

ఇప్పటికే హైడ్రా పరిధిలో ఆస్తుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించిన అధికారాలు ఉండగా.. మరిన్ని అధికారాలు ఇస్తేనే లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం(Cabinet) ఆమోదంతో ఈ ఆర్డినెన్స్‌ను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Share post:

లేటెస్ట్