ManaEnadu:సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) కన్నుమూశారు. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్సపొందుతూ ఆయన ఇవాళ (సెప్టెంబరు 12వ తేదీ 2024) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 19న దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. గత రెండ్రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన కన్నుమూశారు.
1952 ఆగస్టు 12న చెన్నై (Chennai)లో సీతారాం ఏచూరి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఏపీలోని కాకినాడ వాసులు. చెన్నైలో పెరిగిన ఏచూరి హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేశారు. దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆర్థికశాస్త్రంలో బీఏ చదివిన ఆయన అక్కడి జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీలో ఆర్థికశాస్త్రంలో ఎంఏ అభ్యసించారు.
1969నాటి తెలంగాణ ఉద్యమం (Telangana Movement) ఏచూరిని దిల్లీకి తీసుకొచ్చింది. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరిన ఆయన ఏడాది తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్)లో చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జేఎన్‌యూలో విద్యార్థిగా ఉన్నప్పుడు అరెస్టయ్యారు. 1977-78లో మూడుసార్లు జేఎన్‌యూ అధ్యక్షుడిగా ఎన్నికైన ఏచూరి.. 1978లో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి, 2005 జులైలో బంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సీతారం ఏచూరి మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.