Mana Enadu:శ్రావణమాసం వచ్చేసింది. ఇవాళ్టి (ఆగస్టు 5వతేదీ 2024) నుంచి శ్రావణం మొదలైంది. ఇక ముత్తైదువుల పూజలు, వ్రతాలు ఈ వారం నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే శుభముహూర్తాలు కూడా మొదలయ్యాయి. దాదాపుగా మూడున్నర నెలల తర్వాత శుభముహూర్తాలు వచ్చాయి. గత ఏప్రిల్ 28వ తేదీ నుంచి శుక్ర మూఢమి, గురు మూఢమి రావడంతో వివాహాలకు అవాంతరం ఏర్పడింది.

నేటి నుంచి శ్రావణమాసం మొదలవ్వడంతో మూడు నెలల పాటు నిలిచిపోయిన శుభకార్యక్రమాలు ఈ శ్రావణంలో జోరందుకోనున్నాయి. ఆగష్టు 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నెలలో 17, 18వ తేదీల్లో అత్యద్భుత ముహూర్తాలు ఉన్నాయని.. ఈ రెండ్రోజుల్లే తెలుగు రాష్ట్రాల్లో వేలాది జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాయని అంటున్నారు. మరి శ్రావణంలో సుమూహూర్తాలున్న రోజులు ఏవంటే..?
ఆగష్టు 5వ తేదీతో మొదలయ్యే శ్రావణమాసం.. సెప్టెంబర్ 3తో ముగుస్తుంది. ఆగష్టు 31 లోపే శుభకార్యాలు ముగించుకోవాలని పురోహితులు చెబుతున్నారు. ఆగష్టు 7, 8, 9, 10, 11, 15, 16, 17, 18, 21, 22, 23, 24, 28 తేదీల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. 17, 18 తేదీల్లో అత్యంత శుభ ముహూర్తాలు ఉన్నాయని.. ఈ రెండ్రోజుల్లో వేలాది వివాహాలు జరగనున్నాయని వెల్లడించారు.
శ్రావణమాసం రావడంతో ఇన్నాళ్లూ పని లేక ఇబ్బందులు ఎదుర్కున్న వారంతా ఇక బిజీబిజీ కానున్నారు. పురోహితులు, కల్యాణ మండపాలు, బాజా భజంత్రీల వాళ్లు, ఫొటోగ్రాఫర్లు, ఈవెంట్ నిర్వాహకులు, ప్రింటింగ్ ప్రెస్, క్యాటరింగ్, నగల వ్యాపారులు, బ్యూటీషియన్స్, కిరాణం దుకాణాలు, పూల వ్యాపారులకు ఈ శ్రావణంలో ఫుల్ డిమాండ్ పెరగనుంది. మూణ్నెళ్ల పాటు పనిలేకుండా ఉన్న వీరంతా ఇప్పుడు ఫుల్ బిజీ కానున్నారు.






