Mana Enadu:హాలీవుడ్ నటుడు, డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ జాన్ సీనా భారత్‌పై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. ఇటీవలే అంబానీ ఇంట్లో వివాహానికి హాజరైన జాన్ సీనా.. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు ఇండియన్ ఫుడ్‌పై తన ప్రేమను మరోసారి ప్రపంచానికి తెలిజేశాడు. ప్రస్తుతం జాన్ సీనా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఇండియా లవ్స్ జాన్ సీనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
జులై నెలలో ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్‌లో వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రపంచ దేశాల నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. అందులో హాలీవుడ్ యాక్టర్, డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ జాన్ సీనా కూడా ఉన్నాడు. ఈ వివాహానికి ఆయన సంప్రదాయ దుస్తుల్లో పౌడర్ బ్లూ రంగులో ఉన్న షేర్వాణీ ధరించి వచ్చాడు. అయితే ఈ వివాహం కోసం ఇండియా వచ్చింది కొన్ని రోజుల కోసమే అయినా.. ఆ కొంత సమయంలో భారత్ నుంచి తానెంతో నేర్చుకున్నానని జాన్ సీనా చెప్పాడు. తన ఇండియా టూర్ గురించి తాజాగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
‘‘అంబానీ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో ప్రపంచంలో ప్రసిద్ధి అయిన అన్ని రకాల వంటకాలను వడ్డించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల నుంచి అతిథులు రావడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వంటలను అందుబాటులో ఉంచారు. అయితే వాటన్నింటిలోకెళ్లా తనకు భారత రుచులు అద్భుతంగా అనిపించాయని జాన్ సీనా చెప్పుకొచ్చాడు. ఇక్కడి మసాలా, స్పైసీ వంటకాలు తనను ఛాలెంజ్ చేశాయని అన్నాడు. వాటిని ఆస్వాదించడంలో తన స్టామినాను టెస్ట్ చేయాలని ఉందని.. అందుకోసమే మరోసారి భారత్ రావాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు ఈ ఛాంపియన్.