Hyderabad: ఇక హైదరాబాద్ రోడ్లపై నీళ్ళు ఉండవు

గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతాయి.. అలాంటి పరిస్థితులకు చెక్‌ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. ట్రాఫిక్‌ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సర్వే చేపట్టి నీరు నిలిచే 127 ప్రాంతాలను గుర్తించారు. వాటిని చక్కదిద్దాలని కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ ఆదేశించారు. ఆమేరకు ఈఎన్‌సీ జియాఉద్దీన్‌ ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. కొన్నిచోట్ల పూర్తవగా, మరికొన్ని చోట్ల కొనసాగుతున్నాయి.

కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు..

మాదాపూర్‌ నెక్టార్‌గార్డెన్‌లోని రహదారి దుర్గం చెరువులోని నీటి మట్టానికి సమానంగా ఉంటుంది. దాంతో.. మాదాపూర్‌లో భారీవర్షం కురిసిన ప్రతిసారీ నెక్టార్‌గార్డెన్‌ మునుగుతుంది.భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా.. లోతట్టు ప్రాంతం అవడంతో నెక్టార్‌ గార్డెన్స్‌కు ఎలాంటి మరమ్మతులు చేయలేమని అధికారులు చెబుతున్నారు. ఇదే మాదిరి మలక్‌పేట ఆర్‌యూబీ, తదితర 43 చోట్ల మరమ్మతులు చేయలేని పరిస్థితులున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందువల్ల.. వర్షాకాలం మొదలైన రోజు నుంచే అక్కడ అత్యవసర బృందాలను నియమించాలని నిర్ణయించామంటున్నారు. నీటిని తోడే భారీ మోటార్లు, సామగ్రితో బృందాలను అందుబాటులో ఉంచుతామన్నారు.

24 చోట్ల పనులు పూర్తి..

రెయిన్‌బో ఆసుపత్రి వద్ద చేపడుతున్న పనులు

ఎల్బీనగర్‌ రెయిన్‌ బో ఆసుపత్రి, చాంద్రాయణగుట్ట వల్లీ ఫంక్షన్‌హాల్‌, అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.192, యాఖుత్‌పుర ఆర్‌యూబీ, కొండాపూర్‌ ఆర్‌టీఏ కార్యాలయం వైపు హఫీజ్‌పేట పైవంతెన మొదలయ్యే ప్రాంతం, చందానగర్‌ ఫ్యాషన్‌ ఫ్యాక్టరీ ఎదురుగా, బీహెచ్‌ఈఎల్‌ కూడలి, అల్వాల్‌ మంగాపురం కాలనీ, తదితర 24 చోట్ల వరద నివారణ పనులు చేపట్టారు. మరో 55చోట్ల పనులు కొనసాగుతున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. కంటోన్మెంట్‌ బోర్డు, టీఎస్‌ఐపరిధిలోని 5 రోడ్లకూ మరమ్మతులు జరుగుతున్నట్లు వివరించింది.

Share post:

లేటెస్ట్