Mana Enadu: ప్రతి అమ్మాయికి అమ్మ కావాలనే కోరిక ఉంటుంది. కానీ కొంతమందికి ఆ అదృష్టం దక్కదు. అలాంటి వారికి బిడ్డల్లేరనే బాధ నుంచి దూరం చేస్తోంది. ఐవీఎఫ్ (IVF). పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పలు కారణాల వల్ల పిల్లలు కలగని వారికి సంతానాన్ని కలిగిస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఐవీఎఫ్ ద్వారా చాలా మంది తల్లిదండ్రులై తమ పిల్లలతో హాయిగా జీవితాన్ని గడిపేస్తున్నారు. మరి ఐవీఎఫ్ పద్ధతిలో తల్లిదండ్రులైన సెలబ్రిటీలెవరో తెలుసుకుందామా..
ఐవీఎఫ్ ట్రీట్ మెంట్.. సహజంగా ప్రయత్నించినా సంతానం కలగకపోతే వైద్యులు చివరి ప్రయత్నంగా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది. IVF చికిత్స ఖర్చు దాదాపు లక్ష నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. మహిళల ప్రత్యుత్పత్తి హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా 2021లో అసిస్టెట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐవీఎఫ్ దీని పరిధిలోకి వస్తుంది. ఈ చట్టం మేరకు 21 నుంచి 45 ఏళ్ల లోపు వారు మాత్రమే ఐవీఎఫ్ ద్వారా కృత్రిమ గర్భధారణకు అర్హులు.
షారుక్ ఖాన్- గౌరీ ఖాన్: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ – గౌరీ దంపతులకు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ అనే ఇద్దరు పిల్లల తర్వాత మూడో బిడ్డ (అబ్రామ్ ఖాన్)ను IVF ద్వారా కన్నారు. అయితే అబ్రామ్ నెలలు నిండకుండానే జన్మించినప్పుడు చాలా భయపడ్డామని, దేవుడి దయవల్ల అతన్ని పొందామని చెబుతూ ఉంటోంది ఈ జంట.
ఆమీర్ ఖాన్- కిరణ్ రావు: ఆమిర్ ఖాన్ తన మొదటి భార్యతో ఇరా, జునైద్ ఖాన్ లకు జన్మనిచ్చాడు. ఫస్ట్ వైఫ్ తో విడిపోయిన తర్వాత కిరణ్ రావును పెళ్లాడిన ఆమీర్.. ఐవీఎఫ్ చికిత్స ద్వారా కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్‌కు జన్మనిచ్చారు.
కరణ్ జోహార్: నాన్న అని పిలుపించుకోవాలన్న కారణంతో ఐవీఎఫ్ ద్వారా తండ్రిగా మారారు ప్రఖ్యాత సినీనిర్మాత కరణ్ జోహార్. వివాహం చేసుకోకుండానే ఇద్దరు పిల్లలు యశ్, రూహీలకు జన్మనిచ్చారు.
అక్షయ్ కుమార్- ట్వింకిల్ ఖన్నా: మొదటి బిడ్డ నితారాకు జన్మ నిచ్చిన తర్వాత రెండో బిడ్డ కోసం బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్- ట్వింకిల్ ఖన్నా ఐవీఎఫ్ను ఎంచుకున్నారు. దీని ద్వారా ఆరవ్ కుమార్ కు జన్మనిచ్చారు.
ఫరా ఖాన్- శిరీష్ కుందర్: ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్, శిరీష్ కుందర్ జంట.. 2008లో కుటుంబం IVF ద్వారా ఒకర్ని కాదు ఇద్దరిని కాదు ఒకే కాన్పులో ఏకంగా ముగ్గురికి జన్మనిచ్చారు. ‘ఐవీఎఫ్ ద్వారా పిలల్ని కన్నాం’ అని బహిరంగంగా చెప్పుకున్న తొలి బాలీవుడ్ జంట వీరిదే. IVF ద్వారా పిలల్ని కనే సమయానికి ఫరా ఖాన్ వయసు 43 సంవత్సరాలు.
ఇషా అంబానీ- ఆనంద్ పిరమల్: ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పిరమిల్ జంట కూడా IVF ద్వారానే కవలలకు జన్మనిచ్చారు. తను కూడా తన తల్లిలాగానే ఐవీఎఫ్ ద్వారానే కొడుకు కృష్ణ, కుమార్తె ఆదియాలకు జన్మనిచ్చానని ఓ సందర్భంలో చెప్పారు.