రాజాసాబ్ మంచి మనసు.. వయనాడ్ కోసం ప్రభాస్ భారీ విరాళం

Mana Enadu:ప్రకృతి ప్రకోపానికి గురై అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో దాదాపు 300కు పైగా మంది మరణించారు. వందల సంఖ్యలో ఇంకా ఆచూకీ లేకుండా పోయారు. ఇక వేల మంది నిరాశ్రయులయ్యారు. ఓవైపు ఆత్మీయులను కోల్పోయి.. మరోవైపు నిలువ నీడ లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. అయితే వయనాడ్ ప్రజలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు అండగా నిలిచి భారీగా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ మనసున్న మహారాజు, డార్లింగ్ ప్రభాస్ కేరళకు భారీ విరాళం ప్రకటించారు. వయనాడ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. వయనాడ్ విపత్తు తనను ఎంతో కలిచివేసిందని ప్రభాస్ వాపోయారు. ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలిచేందుకు తన వంతు సాయం చేస్తున్నానని చెప్పారు. వయనాడ్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇక ఇటీవలే వయనాడ్ బాధితులకు తెలుగు చిత్రపరిశ్రమ నుంచి పలువురు స్టార్ హీరోలు భారీగా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇదే ఫ్యామిలీ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కేరళ సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం అందించారు. వయనాడ్ ఘటన తనని కలచి వేసిందని బన్నీ ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపాడు. కేరళ అంటే తనకు ప్రత్యేకమైన ప్రేమ అని.. కానీ ఇప్పుడు తన అభిమానులు ఇలా కష్టాల్లో ఉండటం తనను కలచివేస్తోందని అల్లు అర్జున్ అన్నారు.

Share post:

లేటెస్ట్