Team India Cricketers:అద్భుత విజయాల్లో భాగమైనా.. వీడ్కోలు సెలబ్రేషన్స్ లేవు!

ManaEnadu:భారత్‌లో క్రికెట్(Cricket) ఆటకు ఉన్న క్రేజ్ మరే క్రీడకూ లేదన్నది వాస్తవం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, చిన్నాపెద్దా అని తేడా లేకుండా బాల్, బ్యాట్ పట్టుకొని కాసింత ప్లేస్ దొరికినా చాలు క్రికెట్ ఆడేస్తుంటారు. పైగా ఇప్పుడు క్రికెట్‌లో అవకాశాలు బోలెడు. ఒకప్పుడు టీమ్ఇండియా(Team India)కు ఎంపిక కావాలంటే ఎన్నో ఏళ్లు డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చాటి, ఏళ్లకు ఏళ్లు నిరీక్షించేవారు. కానీ ఇప్పుడు ఎన్నో అవకాశాలు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సత్తా చాటితే చాలు ఐపీఎల్ ద్వారా ఛాన్స్ కొట్టేస్తున్నారు ప్లేయర్లు.. అయితే ప్రతి క్రికెటర్ జాతీయ జట్టుకు ఎంపిక అవ్వడం ఎంత కష్టంతో కూడుకున్నదో.. ఎంపికయ్యాక కూడా అంతే కష్టపడాల్సిందే. లేకపోతే జట్టులో చోటు గల్లంతవడం ఖాయం. అలాగే ప్రతి క్రికెటరూ జాతీయ జట్టు నుంచి వీడ్కోలు పలికేటప్పుడు అంతే ఘనంగా, గౌరవంగా తమ వీడ్కోలు ఉండాలని కోరుకుంటారు. గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌కు సరిగ్గా ఇలాంటి వీడ్కోలే దొరికింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో సచిన్‌లా చాలా మంది స్టార్ ప్లేయర్లకు తాము అనుకున్న విధంగా వీడ్కోలు లభించలేదు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్

టీమ్ఇండియా ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయ‌ర్ల‌లో రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid) ఒక‌డు. వన్డేలు, టెస్టు మ్యాచుల్లో జట్టంతా విఫలమైనా.. తాను మాత్రం గోడలా నిలబడి జట్టును ఆదుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. అలాంటి ప్లేయర్ ఫామ్ కోల్పోవడంతో 2012లో ఆసీస్ టూర్‌లో ఇబ్బంది పడ్డాడు. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టు, వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు చేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు ఇద్దరు మాత్రమే. ఒక‌రు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar).. రెండో వ్య‌క్తి ద్రవిడ్. దీంతోపాటు ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా ద్రవిడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 301 ఇన్నింగ్స్‌ల్లో 210 క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే, ద్ర‌విడ్‌కు వీడ్కోలు మ్యాచ్ గౌరవం దక్కలేదు.

స్వింగ్ కింగ్ జహీర్ ఖాన్

భారత్ క్రికెట్లో ఒకప్పుడు ఫాస్ట్ బౌలింగ్ గురించి ఇతర దేశాల మాజీ క్రికెటర్లు, ప్లేయర్లు దారుణంగా ట్రోల్స్ చేసేవారు. కానీ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ జహీర్ ఖాన్(Zaheerkhan) వచ్చాక ఫాస్ట్ బౌలింగ్‌లో ఒక ట్రెండ్ మొదలైంది. జహీర్ ఖాన్ 92 టెస్టు మ్యాచ్‌ల్లో మొత్తం 311 వికెట్లు తీయగా, జహీర్ 200 వన్డేల్లో మొత్తం 282 వికెట్లు తీశాడు. ఇది కాకుండా 17 టీ20 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున జహీర్ 600కి పైగా వికెట్లు తీసుకున్నాడు. 2017 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు, కానీ అతనికి వీడ్కోలు మ్యాచ్ గౌరవం లభించలేదు.

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) టీమ్ ఇండియాకు ఎన్నో గొప్ప విజయాలు కట్టబెట్టిన ప్లేయర్. కెప్టెన్సీ చేసిన మొదటి ఐసీసీ టోర్నమెంట్ 2007 టీ 20 వరల్డ్ కప్‌ను భారత్‌కు అందించిన ప్లేయర్. ధోనీ హయాంలో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలు సొంతం చేసుకుంది. 2007 టీ20WC,2011 వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఇవి కాకుండా 2009లో తొలిసారిగా భారత్ టెస్టుల్లో నంబర్ వన్‌గా నిలిచింది. కాగా, డిసెంబర్ 2014లో ధోని అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు, 2020న వ‌న్డే, టీ20 ఇంటర్నేషనల్ నుంచి సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌కు అద్భుత‌మైన క్ష‌ణాలు అందించిన ధోనీ త‌ప్ప‌కుండా వీడ్కోలు మ్యాచ్‌కు అర్హుడు, కానీ అతని కోసం అలాంటి ఏర్పాటు చేయలేదు.

 డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్

క్రికెట్ చరిత్రలోనే అత్యంత భయంకర ఓపెనర్ ఎవరంటే అది వీరేంద్ర సెహ్వాగ్(Veerendra Sehwag) అని అభిమానులు చెబుతుంటారు. బౌలర్ ఎవరనేది చూడకుండా బంతిని బౌండరీ దాటించడమే వీరేంద్రుడి స్పెషల్. వీరూ భారత్ తరఫున 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేశాడు, ఇందులో 23 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 319. వీరూ 251 వన్డేల్లో 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలతో 8273 పరుగులు చేశాడు. దీంతోపాటు 19 టీ20 మ్యాచ్‌లలో 394 పరుగులు చేశాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు, కానీ అతనికి వీడ్కోలు మ్యాచ్ గౌరవం లభించలేదు.

 2011 వరల్డ్ కప్ హీరో గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్.. లెఫ్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. సచిన్, సెహ్వాగ్‌తో ఓపెనింగ్ చేసిన ఈ ప్లేయర్.. 2007 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లు, 2011లో శ్రీలంకతో వన్డే ప్రపంచకప్‌లో గౌతమ్ గంభీర్(Goutam Gambhir) హీరోగా నిలిచాడు. తన కెరీర్‌లో 58 టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 147 వన్డేల్లో 39.68 సగటుతో 5238 పరుగులు చేశాడు. టీ20ల్లోనూ గంభీర్ 37 మ్యాచ్‌లలో 7 932 రన్స్ చేశాడు. 2018లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైరయ్యాడు.. కానీ అతనికీ వీడ్కోలు మ్యాచ్ గౌరవం లభించలేదు. ఇలా చాలా మంది ప్లేయర్లు టీమ్ ఇండియా తరఫున అదరగొట్టారు. అందులో చాలా మందికి ఇలాంటి పేలవ వీడ్కోలే దక్కింది.

Share post:

లేటెస్ట్