ManaEnadu: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇటీవలే స్వదేశంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఇక తన స్వగ్రామం హరియాణాలోని బలాలికి అర్ధరాత్రి చేరుకున్న వినేశ్‌కు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. సొంతూళ్లో అడుగు పెట్టిన వినేశ్ ను ఆమె పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ ఆప్యాయంగా కౌగలించుకుని భావోద్వేగానికి గురయ్యారు. వినేశ్ కూడా కంటతడి పెట్టుకొంది.
మరోవైపు సొంతూరు ప్రజలు వినేశ్ కు నీరాజనాలు పట్టారు. ఘనంగా స్వాగతం పలికి.. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం గోల్డ్ మెడల్ అందించారు. ‘ఒలింపిక్ మెడల్ గెలవకున్నా సరే.. నువ్వు ఎప్పటికీ ఛాంపియన్‌వే’ అంటూ ఆమెను ఘనంగా సన్మానించి వినేశ్‌కు స్వర్ణ పతకాన్ని అందజేశారు. ఇక తమ ఊరు ఆడబిడ్డ పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లి వచ్చినందుకు బలాలి గ్రామస్థులు వినేష్ పట్ల గర్వం వ్యక్తం చేశారు.
దిల్లీ నుంచి దాదాపు 10 గంటలపాటు ప్రయాణించి తన గ్రామానికి చేరుకున్న వినేశ్ కు వారు ప్రైజ్‌మనీ ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన వాచ్‌మన్ కూడా రూ.100 ఇచ్చాడు. మొత్తం రూ.21 వేలను ఆమెకు బహుమతిగా అందించారు. అదే విధంగా 750 కేజీల లడ్డూలను తయారు చేసి అందించారు. వాటిని గ్రామమంతా పంచేశారు. వినేశ్ రాక బలాలిలో పండుగ వాతావరణం తీసుకువచ్చింది.