Mana Enadu: అది సంధ్యాసమయం.. చీకటిపడ్డ తర్వాత కూడా ఓ అమ్మాయి రోడ్డుపైనే తిరుగుతుంది. తానుండే చోటు కాస్త నిర్మానుష్య ప్రాంతంలో ఉంటుంది. ఒంటరిగా నడుచుకుంటూ వస్తోంది. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఓ అల్లరి మూక. అకస్మాత్తుగా ఆ అమ్మాయిని చుట్టుముట్టింది. అప్పటికే చీకటి భయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్తున్న ఆ అమ్మాయికి ఆ ఆకతాయిలను చూడగానే గుండె దడ మొదలైంది. ఇవాళ తాను ఇంటికి సురక్షితంగా చేరుకోవడం సాధ్యం కాదని ఆమె భయపడింది. భయపడుతూనే వాళ్ల నుంచి తప్పించుకునేందుకు తన శక్తినంతా కూడదీసుకుని పరుగులంకించింది. అలా రాళ్లురప్పలు, ముళ్లు ఏదీ చూడకుండా.. కాళ్లకెంత నొప్పి పుడుతున్నా.. రక్తాలు కారుతున్నా పరిగెడుతూనే ఉంది. తన మనసంతా ఒకే ఆలోచన. ఆ అల్లరిమూకల కళ్లకు కనిపించకుండా పారిపోవడం. అలా పారిపోతూ పారిపోతూ ఓ లారీ కనబడగానే ఎక్కేసింది. వాళ్లకు కనిపించకుండా దాక్కుంది. కానీ కొద్దిసేపటికే ఆ లారీ కదిలింది. అలా ఆ లారీలో ఆ రాత్రిపూట ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా ప్రయాణం సాగించింది. కానీ ఆ మూకల నుంచి తప్పించుకున్నాననే ఆలోచనతో కాస్త ఆ అమ్మాయి గుండె శాంతించింది.

సీన్ కట్ చేస్తే..
పైన చెప్పినదంతా ఏదో సినిమాలో ఉన్న సీన్లా అనిపించింది కదూ. కానీ ఇలాంటి సంఘటనే ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. కాకపోతే అక్కడ ఒక అమ్మాయి.. ఇక్కడ ఇద్దరు బాలికలు. యూపీలోని హాథ్రాస్‌కు చెందిన ఇద్దరు బాలికలు చీకటిపడ్డాక ట్యూషను నుంచి తిరిగివస్తుండగా కుర్రాళ్లు వెంటపడ్డారు. భయపడ్డ బాలికలు వారి నుంచి తప్పించుకునేందుకు పరుగుతీశారు. అలా వాళ్ల కంట కడపడకుండా ఉండేందుకు ఓ రైల్వేస్టేషనులో ఆగి ఉన్న గూడ్సు బండెక్కి దాక్కున్నారు. కానీ ఇంతలో రైలు కదిలిపోయింది. అలా 140 కి.మీ.లు రైలు ప్రయాణించారు ఆ బాలికలు. కాసేపటికి చేతిలో ఉన్న సెల్‌ఫోనుతో ఇంట్లోవాళ్లకు సమాచారం ఇచ్చారు. కానీ ఎక్కడ ఉన్నారో.. ఎటు వెళుతున్నారో మాత్రం స్పష్టంగా చెప్పలేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
అయితే హాథ్రాస్ నుంచి బయలుదేరిన రైలు రాత్రి 11.00 గంటలకు ఇటావాలో ఆగిన తర్వాత సంతకం చేసేందుకు స్టేషనులోకి వెళ్లబోయిన ఆర్య ప్లాట్‌ఫాం మీద కూర్చున్న ఈ బాలికలను గమనించారు. వాళ్ల వద్దకు వెళ్లి ఏం జరిగిందో ఆరా తీయగా జరిగిన విషయం చెప్పారు. ఈ విషయం ఆర్య స్టేషను సూపరింటెండెంటు దృష్టికి తీసుకువెళ్లడంతో బాలికల కుటుంబాలతో మాట్లాడి సురక్షితంగా ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 3వ తేదీన జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎట్టకేలకు ఆ బాలికలు సురక్షితంగా ఇల్లు చేరుకున్నారు.







