Mana Enadu:సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు నేటి తరం చేస్తున్న విన్యాసాలు అంతా ఇంతా కాదు. లైకులు, వ్యూస్ కోసం ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేస్తూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. సెల్ఫీలంటూ ఎత్తైన ప్రదేశాల నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక కొందరేమో నెట్టింట విచ్చల విడిగా ప్రవర్తిస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది.
యూట్యూబ్ లో వీడియోల కోసం సాధారణంగా వ్యూయర్స్ ను ఆకర్షించేందుకు వినూత్నంగా థంబ్ నెయిల్స్ పెడుతుంటారు. కానీ ఓ యూట్యూబర్ మాత్రం ఏకంగా తాను వండిన వంటనే మరో వంటకంగా ప్రచారం చేసి పోలీసుల చేతిలో బుక్కైపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్ కుమార్.. యూట్యూబ్ లో వంటలకు సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తుంటాడు. అయితే ఇటీవలో ఓ వీడియోలో.. చికెన్ కర్రీ వండి నెమలి కూర అంటూ థంబ్ నెయిల్ పెట్టి వ్యూయర్స్ ను తప్పుదోవ పట్టించాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు ట్రోల్ చేయడంతో వెంటనే డిలీట్ చేశాడు.
అయితే ఈ విషయం కాస్త అటవీ శాఖ అధికారులకు చేరడంతో వాళ్లు ప్రణయ్ ను అదుపులోకి తీసుకుని కర్రీని, చికెన్ ఈకలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షించేందుకు ల్యాబ్ కు పంపారు. పరీక్షలో వండింది చికెన్ అని తేలితే.. నెమలి కర్రీ వండుతున్నానని తప్పుడు ప్రచారం చేసినందుకు.. ఒకవేళ వండింది నిజంగా నెమలి అయితే అటవీ జంతువుల సంరక్షణ కింద.. ఇలా ఎలాగైనా ప్రణయ్ పై కేసు నమోదవ్వడం ఖాయమని నెట్టింట ప్రచారం జరుగుతోంది.