Mana Enadu: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ దేశంలో విషాదం నింపిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 308కు చేరింది. ఇంకా సుమారు 300మంది ఆచూకీ గల్లంతయింది. మరోవైపు 40 బృందాలు నాలుగో రోజు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి.
ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు. కొండ చరియలు విరిగిపడటంతో గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలను కాపాడేందుకు రెస్క్యూ టీమ్ డేంజరస్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

తాజాగా కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కె.హాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ టీమ్ తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రెస్క్యూ టీమ్ కు హాట్సాఫ్ చెబుతున్నారు. సలామ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అటవీప్రాంతం వద్ద లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకుని ఉండడాన్ని రెస్క్యూ టీమ్ గమనించింది. వారిని కాపాడేందుకు ఏ డేరింగ్ ఆపరేషన్ నిర్వహించింది. మరోవైపు ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోందని సీఎం పినరయి విజయన్ ప్రశంసించారు. ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందామని.. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
దాదాపు నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్న టీమ్.. అక్కడ గుహలో చిక్కుకుని ఉన్న పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించారు. గత నాలుగైదు రోజుల నుంచి తిండీ తిప్పలు లేకుండా ఉండటంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ టీమ్ వెల్లడించింది.
అయితే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. వారిని తమతో రావాల్సిందిగా కోరగా ఆ కుటుంబం నిరాకరించిందట. సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎంతో బతిమాలగా చివరగా తండ్రి ఒప్పుకున్నారట. పిల్లలు ఇద్దరినీ తమ శరీరాలకు కట్టుకొని తాళ్ల సాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. అనంతరం వారిని అత్తమాల యాంటీ-పోచింగ్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ సురక్షితంగా ఉన్నారు.
వర్షాలు తీవ్రరూపం దాల్చడంతో అటవీ శాఖ వయనాడ్‌లోని అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన తెగలకు చెందిన చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా వందల మంది ఆచూకీ లభించడం లేదు.






