వాటర్ బాటిల్స్ నిషేధంపై వివాదం.. తాజ్ మహల్ లో అసలేం జరుగుతోంది?

Mana Enadu:తాజ్​ మహల్‌ మరో వివాదానికి కేంద్ర బిందవైంది. ఈ పాలరాతి కట్టడంలోని ప్రధాన సమాధి వద్దకు వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడాన్ని బ్యాన్ చేయడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. పర్యటకులు నీళ్లు తాగాలనుకుంటే..  ప్రధాన సమాధి సమీపంలోని చమేలీ ఫ్లోర్‌లోకి వచ్చి నీటిని తాగొచ్చని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

తాజ్​ మహల్ అసలు పేరు తేజోమహాలయం అని, అది శివుడికి నెలవు అని వాదిస్తూ..  అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు తాజ్ మహల్‌లోని ప్రధాన సమాధిపై ఆగస్టు3 వ తేదీన గంగాజలం పోశారు. దానిపై ఓం స్టిక్కర్లు అంటించి కాషాయ జెండాలూ ఊపుతూ హరహర మహాదేవ్ నినాదాలు చేయగా సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ క్రమంలోనే తాజాగా ప్రధాన సమాధి వద్దకు వాటర్ బాటిల్స్ తీసుకెళ్లడాన్ని నిషేధించారు. మరోవైపు ఈ నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ టూరిస్ట్ గైడ్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దీపక్ దాన్ తప్పుబట్టారు. ఏఎస్ఐ, సీఐఎస్ఎప్ అప్రమత్తంగా ఉండి అలాంటి ఘటనలను అడ్డుకోవాలి కానీ..  వాటర్ బాటిళ్లను తీసుకెళ్లొద్దని నిషేధం అమలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. దీనివల్ల పర్యాటకులు ఇబ్బందిపడే అవకాశం ఉంటుందని అన్నారు.

మరోవైపు తాజ్‌మహల్‌‌పై వివాదాన్ని లేవనెత్తడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, అది సరికాదని ఏఎస్‌ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రాజ్‌కుమార్ పటేల్ అన్నారు. తాజ్‌మహల్‌ను సందర్శించే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యటకులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే ఉచితంగానే వాటర్ బాటిళ్లను అందజేస్తారని చెప్పారు.

Share post:

లేటెస్ట్