షేక్ హసీనాకు బ్రిటన్ షాక్.. ఆశ్రయంపై యూకే హోంశాఖ కీలక కామెంట్స్!

Mana Enadu:బంగ్లాదేశ్‌లో కోటా తెచ్చిన తంటా ఏకంగా ప్రధాని పీఠాన్నే కదిలించింది. రిజర్వేషన్ కోటాలో చెలరేగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోవడంతో అవామీ లీగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. ఈ క్రమంలో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ దేశాన్ని వదిలి వెళ్లారు.

అయితే ఆమె మొదట లండన్ వెళ్లి అక్కడ ఆశ్రయం పొందాలనుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల హసీనా భారత్ కు వచ్చారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. రాజకీయంగా ఆశ్రయం పొందే అంశంపై ఆమె బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఆ సర్కార్ సమాధానం కోసం వేచి చూస్తూ.. అంగీకరించగానే..  ఇక్కడి నుంచి లండన్‌ వెళ్లాలనేది ఆమె ప్లాన్‌. అయితే ఆమె అనుకున్నట్టుగా పరిస్థితులు అనుకూలించలేదని సమాచారం. యూకే నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. 

ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా ఒక వ్యక్తి తమ దేశం వచ్చేందుకు తమ వలస చట్టాలు అంగీకరించవని యూకే హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అవసరంలో ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో యూకేకు గర్వించదగ్గ రికార్డు ఉందని.. ఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఒక వ్యక్తి యూకే వచ్చేందుకు అనుమతించేలా నిబంధన ఏదీ లేదని యూకే హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి జాతీయ మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు.. వారు తొలుత చేరుకున్న సురక్షిత దేశంలోనే ఆశ్రయం అడగాలని.. అదే వారి రక్షణకు అత్యంత వేగవంతమైన మార్గమని వెల్లడించారు. షేక్ హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందాలనే అర్థంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. హసీనా సోదరి రెహానా యూకే పౌరురాలు. ఆమె కుమార్తె తులిప్‌ సిద్దిఖీ ప్రస్తుతం లేబర్‌ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలు. ఈ క్రమంలోనే బ్రిటన్‌ ప్రభుత్వాన్ని హసీనా  ఆశ్రయం కోరినట్లు సమాచారం.

Share post:

లేటెస్ట్