Mana Enadu:నేటి తరంలో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి వద్ద ఉంది. ఫోన్ లేని జీవితాన్ని నేటితరం ఊహించుకోవడానికి కూడా ఇష్టపడతు. పూట తిండికి చేతిలో రూపాయి లేకపోయినా.. జేబులో స్మార్ట్ ఫోన్ మాత్రం పక్కా ఉంటోంది. ఇక మొబైల్ వాడకం అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఆరేళ్ల పసిపిల్లల నుంచి అరవై ఏళ్ల పండు ముసలి వాళ్ల వరకు ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు. ఒక్క క్షణం చేతిలో ఫోన్ లేకపోతే విలవిల్లాడిపోతున్నారు. ఫోన్‌కు దూరంగా ఉంటే కొందరిలో తెలియని భయం, ఏదో ఆందోళన కలుగుతూ ఉంటోంది. ఇలా అయితే కాస్త జాగ్రత్తపడాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇలాంటి లక్షణాలు ‘నోమో ఫోబియా’ ను సూచిస్తాయని అంటున్నారు. ‘నోమో’ ఫుల్ ఫామ్ ‘నో మొబైల్’ అని.. ఇదొక మానసిక రుగ్మత అని చెబుతున్నారు.
‘నోమోఫోబియా’ అనే మానసిక రుగ్మతను 2008లో యునైటెడ్ యూకేలో గుర్తించారు. బ్రిటన్‌లోని మొబైల్ ఫోన్ వినియోగదారులలో 53 శాతం మంది తమ ఫోన్లను ఉపయోగించలేనప్పుడు ఆందోళన చెందుతున్నారని యూకే పోస్టాఫీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మరి ఈ నోమోఫోభియా లక్షణాలు ఏంటి.. మీకూ ఈ లక్షణాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేస్కోండి.

ఇవే నోమోఫోబియా లక్షణాలు
ఈ రుగ్మత బారినపడిన వారు ఫోన్‌కు కొత్త నోటిఫికేషన్‌లు, మెసేజ్‌లు రాకపోయినా వాటి కోసం తరచుగా ఫోన్‌ను చెక్ చేస్తుంటారు.
చేతిలో ఫోన్ లేకపోయినా ఇంటర్నెట్ సిగ్నల్స్ కనెక్టివిటీని కోల్పోయినా టెన్షన్ పడుతుంటారు.
కొంతమంది సోషల్ మీడియాను గుర్తింపు కోసం వాడుతుంటారు. ఇలాంటి వారి ఉనికి ఫోన్‌పైనే ఆధారపడి ఉందనే భావనలో జీవిస్తుంటారు.
కొంతమంది సాధ్యమైనంత మేర ఫోన్‌ను తాము ఉన్న ప్రదేశానికి దూరంగా పెట్టరు.
నోమోఫోబియాను ఎలా అధిగమించాలంటే..
స్మార్ట్‌ఫోన్ వినియోగించే సమయాన్ని తగ్గించాలి. దీనివల్ల ఆందోళన , ఆత్రుత చాలావరకు తగ్గిపోతాయి.
ఫోన్ వాడేందుకు నిర్దిష్ట సమయాలు సెట్ చేసుకోవాలి. రోజుల్లో ఎంతసేపు ఆన్‌లైన్‌లో ఉండాలి? ఎంతసేపు ఆఫ్‌లైన్‌లో ఉండాలి ? అనే దానిపై క్లారిటీ వస్తుంది. అలా క్లారిటీ వచ్చిన తర్వాత షెడ్యూల్ చేసుకుని ప్లాన్ ప్రకారం నడుచుకోవాలి.
ఫోన్ ద్వారా వచ్చే అలజడిని తగ్గించుకోవాలంటే మైండ్‌ఫుల్ మెడిటేషన్ చేయాలి. ఫోన్‌కు దూరంగా ఉండేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
నోమోఫోబియా వల్ల మానసిక స్థితిగతులపై ప్రభావం పడినట్లు కనిపిస్తే, తప్పకుండా మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. వారు తగిన సలహాలను అందిస్తారు.
గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.








