ManaEnadu:హైదరాబాద్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు (Gnaesh Navaratri) కన్నులపండువగా జరుగుతున్నాయి. వినాయకుడికి వాడవాడలా పూజలందుతున్నాయి. ఉదయం మొదలయ్యే పూజలు అర్ధరాత్రి భజనలతో ముగుస్తున్నాయి. వినాయక సంబురాలతో రాష్ట్రవ్యాప్తంగా ఊరువాడా సందడిగా మారింది. మరోవైపు ఉత్సవాల్లో మూడో రోజు నుంచి హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో నిమజ్జనం ప్రక్రియ మొదలైంది.
17న సామూహిక నిమజ్జనం
ఈ నేపథ్యంలో అనంత చతుర్ధశి సందర్భంగా ఈనెల 17వ తేదీన సామూహిక నిమజ్జనం (Ganesh Nimajjanam) ఉండనుంది. హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నిమజ్జనానికి ఎలాంటి అడ్డంకులు లేవు. 2021 హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలనూ నిమజ్జనం చేయొచ్చు.
మందు బాబులకు షాక్
మరోవైపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) మందుబాబులకు షాక్ ఇచ్చారు. వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ బంద్ (Wines Bandh) కానున్నాయి. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు అన్నింటికీ నిబంధనలు వర్తిస్తాయి.
నిమజ్జనం స్పెషల్ ట్రైన్స్
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 17, 18వ తేదీల్లో 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసుల (MMTS Trains)ను నడపనున్నట్టు తెలిపింది. లింగంపల్లి, ఫలక్‌నుమా, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి రాత్రి, ఉదయం రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ నుంచి లింగంపల్లి 17న రాత్రి 11.10గంటలకు ప్రారంభమై తెల్లవారుజాము 3.30 గంటల వరకు ఆయా స్టేషన్ల నుంచి రాకపోకలు సాగనున్నాయి.
మరోవైపు గణేశ్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుల సందర్భంగా అధికారులకు సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు పండుగల ఊరేగింపులు సజావుగా ముగిసేందుకు ధైర్యంగా, స్వేచ్ఛగా పనిచేయాలని సూచించారు. అత్యంత సున్నితమైన ప్రాంతాలు రెండు జోన్లలో ఉన్నాయని చెప్పారు. రౌడీలు, ఇతర సంఘ విద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని అధికారులను సీపీ అప్రమత్తం చేశారు.