Mana Enadu: రోజురోజుకీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. భారత సంతతికి చెందిన మహిళా నేత కమలా హ్యారిస్ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. జో బైడెన్ డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధిగా హారిస్‌ను ప్రకటించిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకూ గెలుపుపై ధీమాతో రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకబడ్డారు. ప్రస్తుతం కమలాకే విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. తాజాగా వాష్టింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్ ఐపోస్ పోల్ సర్వేలో ట్రంప్ కంటే కమలా హ్యారిస్ నాలుగు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు వెల్లడయ్యింది.
డెమోక్రాట్లలో నూతనోత్సాహం
దీంతో డెమోక్రాటిక్ జాతీయ సదస్సుకు ముందు తాజా సర్వే ఫలితాలు ఆ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఈ కన్వెన్షన్‌లో డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ నామినేషన్‌ను అధికారికంగా ఆమోదించనున్నారు. చికాగో వేదికగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగునుంది. మరోవైపు వాషింగ్టన్ పోస్ట్ సర్వేలో హ్యారిస్‌కు 49 శాతం, డొనాల్డ్ ట్రంప్‌నకు 45 శాతం మద్దతు ఉన్నట్టు తేలింది. ఒకవేళ తటస్థులను పరిగణనలోకి తీసుకుంటే హ్యారిస్‌దే ఆధిపత్యమని పేర్కొంది. వారిని కలిపితే కమలాకు 47 శాతం, ట్రంప్‌నకు 44 శాతం, రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌కు 5 శాతం మద్దతు ఉన్నట్టు తెలిపింది. ఇక, గత నెలలో నిర్వహించిన సర్వేలో ట్రంప్ 43 శాతంతో జో బైడెన్ కంటే (42 శాతం) ఒక్క పాయింట్ ఆధిక్యంలో ఉండగా.. కెన్నడీకి 9 శాతం లభించింది.
తాజా పోల్స్‌లోనూ హారిస్ దూకుడు
తాజా పోల్‌లో డెమోక్రాట్‌లకు స్వల్ప ఆధిక్యం లభించినప్పటికీ నవంబరులో జరిగే ఎన్నికల్లో హోరాహోరీ తప్పదని తెలుస్తోంది. ఏడు స్వింగ్ స్టేట్స్ మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనా, నెవాడాలో ఇద్దరు అభ్యర్థులకు విజయానికి అవకాశాలు సమానంగా ఉన్నాయి. కానీ, బైడెన్ వెదొలగిన తర్వాత రేసులోకి వచ్చిన కమలా హ్యారిస్‌కు ఈ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో మద్దతు పెరిగినట్టు పలు సర్వేల్లో వెల్లడయ్యింది. జూన్ 27న డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో జో బైడెన్ పేలవ ప్రదర్శన ఆయనను చిక్కుల్లో పడేసింది. దీంతో సొంత పార్టీ నేతల నుంచే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. చివరకు ఎన్నికల బరి నుంచి వైదొలగాల్సి వచ్చిన విషయం తెలిసిందే.. మరి వైట్‌హౌస్ పీఠంపై కూర్చొనెదేవరో మరికొన్ని నెలల్లో తేలనుంది.