ManaEnadu:పారిస్ ఒలింపిక్స్లో 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటు పడి పతకం కోల్పోయిన తర్వాత భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఆమె రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆమె ఎక్స్ లో చేసిన పోస్టు చూస్తుంటే.. తాను ఇంకా ఆడాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో తన భవిష్యత్ ఎలా ఉంటుందో అర్థం కాలేనని ఆమె చెప్పింది. ఒత్తిడికి లొంగేతనం తనది కాదని.. ఇంకా రెజ్లింగ్ ఆడే సత్తా తనలో ఉందంటూ వినేష్.. తాను రెజ్లింగ్ కొనసాగిస్తానని పరోక్షంగా చెప్పింది.
‘‘ మీ అందరికి ఓ విషయం చెప్పాలని ఉంది. పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించేందుకు చాలా కష్టపడ్డాను. నా ప్రత్యర్థులకు ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఆటాడాను. వాళ్లకు లొంగిపోలేదు. కానీ, కాలం కలిసి రాలేదు. అందుకే అనూహ్య రీతిలో వెనుదిరాల్సి వచ్చింది. అయినా ఇక్కడితో నా పోరాటం ఆగదు. ప్రస్తుతం నాకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ సమయం నాది కాదు. కోట్లాది భారతీయులు, నా బృందం, కుటుంబం అనుకున్న లక్ష్యం పూర్తి కాలేదు. అయితే పరిస్థితులు ఇకపై మునుపటిలా ఉండవు. 2032 వరకు ఆడే సత్తా ఉందేమో అనుకుంటున్నాను. కానీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలియదు. నమ్మినదాని గురించి పోరాటం మాత్రం నేను ఆపను. నా ఇప్పటి వరకు జర్నీలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు.’’ అని వినేశ్ ఫొగాట్ తన పోస్టులో రాసుకొచ్చింది.
ఇక భారత అథ్లెట్ల తరఫున పారిస్ వెళ్లిన వైద్య బృందంలో ఒకరైన డాక్టర్ దిన్షా పార్దివాలా ఒక దేవదూత అని వినేశ్ కొనియాడింది. తనతో పాటు ఇతర ఇండియన్ అథ్లెట్లకు పార్దివాలా కేవలం ఒక డాక్టర్ మాత్రమే కాదు దేవుడు పంపించిన వ్యక్తి అని రాసుకొచ్చింది. తాను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయాలవ్వడంతో తనపై తాను నమ్మకం కోల్పోయానని.. ఆ సమయంలో ఆయన ఎంతో ధైర్యం అందించి మళ్లీ బరిలోకి దిగేవిధంగా ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేసుకుంది.








