మన ఈనాడు: రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టును నిర్మించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు భవనం శిధిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు.
Telangana New High Court: మరో నెలరోజుల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్(Hyderabad) లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిధిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సీఎంకు విజ్ఞప్తి చేశారు.






