
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అందజేయనున్న గద్దర్ అవార్డుల (Gaddar Awards 2025) గురించి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC Chairman Dil Raju) ఛైర్మన్ దిల్ రాజు కీలక అప్డేట్స్ ఇచ్చారు. ఏప్రిల్లో ఘనంగా ఈ పురస్కారాల ప్రదాన వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. నంది అవార్డుల తరహాలో స్వల్ప మార్పులు చేసి గద్దర్ పురస్కారాల విధివిధానాలు ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఉర్దూ చిత్రాలకు కూడా ఈ పురస్కారాలు అందజేయనున్నట్లు చెప్పారు.
గద్దర్ అవార్డులను వివాదం చేయొద్దు
“గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల (Gaddar Telangana Film Award) పేరుతో ఇక నుంచి ప్రతి ఏటా అవార్డులు ఇవ్వనున్నాం. పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో ప్రత్యేక అవార్డులు ప్రదానం చేయనున్నాం. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు కూడా ఒక్కో ఉత్తమ చిత్రానికి గద్దర్ అవార్డులు దక్కనున్నాయి. 2024కు సంబంధించి అన్ని కేటగిరిల్లోనూ అవార్డులు ఇస్తాం. రేవంత్ (CM Revanth) సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ఇస్తున్న గద్దర్ అవార్డులను ఎవరూ వివాదం చేయవద్దు. సినీ పరిశ్రమలో ఈ వేడుక ఓ పండుగలా చేసుకుందాం.” అని దిల్ రాజు పేర్కొన్నారు.
గద్దర్ అవార్డుల ఎంట్రీకి ఆహ్వానం
గద్దర్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. వారం రోజుల్లో జ్యూరీని నియమించి దరఖాస్తులను స్క్రీనింగ్ చేయనున్నారు. జ్యూరీ సభ్యులుగా ఎఫ్డీసీతోపాటు సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఉండనున్నారు. ఉత్తమ తెలుగు, ఉర్దూ చిత్రాలతో పాటు జాతీయ సమగ్రతా చిత్రం సహా 11 కేటగిరిలో గద్దర్ తెలంగాణ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అదే విధంగా ఉత్తమ ప్రజాదరణ పొందించిన చిత్రం (Best Popular Film) కేటగిరికి డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి పేరుతో పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత అవార్డులను, స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా అందజేస్తుంది.