పాకిస్తాన్ పేరెత్తగానే పేట్రేగిపోయేవారు ఒకప్పటి క్రికెటర్లు. ఇతర దేశాలను ఈజీగా తీసుకున్నా.. పాక్ వరకొచ్చేసరికి మ్యాచ్‌లో స్కోరు తమదే ఉండాలని, వికెట్లు తమకే దక్కాలనే తపనే ఒకప్పుడు కనిపించేది. ఈ విషయాన్ని సీనియర్లు చాలామంది మీడియా ముఖంగా చెప్పారు కూడా. సోమవారం ఇదే తరహాలో విరాట్ కోహ్లీ సెంచురీ బాదేశాడు. విరాట్ వీర విహారానికి పాక్ బౌలింగ్ టీం విలవిల్లాడిపోయింది. మ్యాచ్ అనంతరం ఈ సెంచరీ గురించి మాట్లాడిన కోహ్లీ.. ‘నేను ఆ రన్స్ కోసం చాలా హ్యాపీ ఫీలయ్యా. కానీ అరే.. రేపు 3 గంటలకు మళ్లీ మ్యాచ్ ఆడాలి అని ఆలోచిస్తూనే ఉన్నా. అయితే మేం టెస్టు ప్లేయర్లం. నేను వంద టెస్టులకుపైగా ఆడా. కాబట్టి మరుసటి రోజే వచ్చి ఆడటం ఎలాగో నాకు తెలుసు. ఇక్కడ వాతావరణం చాలా తేమగా ఉంది. నాకు నవంబరులో 35 ఏళ్లు వస్తాయి. కాబట్టి రికవరీపై కూడా ఫోకస్ పెట్టాలి’ అని చెప్పుకొచ్చాడు.
ఇందులో భాగంగానే తనను ఇంటర్వ్యూ చేస్తున్న మంజ్రేకర్‌తో తాను బాగా అలిసిపోయానంటూ కోహ్లీ జోకులు పేల్చాడు. ‘నేను బాగా టైర్ అయిపోయా. ఈ ఇంటర్వ్యూను త్వరగా ముగించాలని నిన్ను అడుగుదాం అనుకున్నా’ అని చెప్పాడు. కోహ్లీ చేసిన 122 పరుగుల్లో 68 రన్స్ కేవలం పరిగెత్తి సాధించినవే కావడం గమనార్హం.
స్ట్రైక్ రొటేట్ చేయడమే తన పని అని, ఆ విషయంలో చాలా గర్వపడతానని కోహ్లీ అన్నాడు. ‘జట్టుకు రకరకాలుగా హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడూ ప్రిపేర్ అయ్యి ఉంటా. కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్ అద్భుతంగా ఆరంభించాడు. అప్పుడు నా పని స్ట్రైక్ రొటేట్ చేయడమే. ఈజీ రన్స్ కోసం పరిగెత్తే విషయంలో నేను చాలా గర్వం ఫీలవుతా. ఈజీగా డబుల్ వచ్చే ఛాన్స్ ఉంటే దాని కోసం పరిగెత్తడం కూడా ఈజీనే’ అని చెప్పాడు.