తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections 2025) ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు నేడే ఆఖరు తేదీగా ఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు
తెలంగాణలో నాలుగు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు (Telangana MLC Elections 2025) జరగనున్న విషయం తెలిసిందే. ఒక పట్టభద్రుల స్థానానికి, మూడు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు.. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ స్థానాలకు ఇప్పటివరకు 85 నామినేషన్లు దాఖలయ్యాయి.
నేడు పెద్దసంఖ్యలో నామినేషన్లు
మరోవైపు వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు (MLC Election Nominations 2025) దాఖలైనట్లు అధికారులు తెలిపారు. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో ఇవాళ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు (AP MLC Elections 2025) ఇప్పటివరకు 20 మంది నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్‌లో పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు లక్ష్మణరావు నామినేషన్ వేయనున్నారు. ఇక మంగళవారం రోజున అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది.







