ట్రంప్‌ టీమ్ లో ఎలాన్ మస్క్‌, వివేక్‌ రామస్వామి

Mana Enadu : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald trump) తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ప్రముఖులకు కీలక బాధ్యతలు అప్పగించారు. వారిద్దరే.. స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon musk), వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy). వీరికి ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు డొనాల్డ్ ట్రంప్.

ఈ ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నింబధనల కోత వంటి బాధ్యతలు నిర్వహిస్తారని డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్‌ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు కూడా చూసుకుంటారని తెలిపారు. ‘సేవ్‌ అమెరికా-2 ఉద్యమానికి (Save America 2 Movement) ఇవి ఎంతో ముఖ్యమైనవన్న ట్రంప్.. వీరిద్దరూ తన పాలనకు మార్గం సుగమం చేస్తారనితన ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు, నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ మాజీ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ను డొనాల్డ్ ట్రంప్.. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (Central Intelligence Agency) డైరెక్టర్‌గా నియమించారు. అమెరికన్లందరి రాజ్యాంగ హక్కుల కోసం నిర్భయమైన పోరాట యోధుడిగా రాట్‌క్లిఫ్‌ నిలుస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ రాయబారి(Israel Ambassidor)గా అర్కాస్నాస్‌ మాజీ గవర్నర్‌ మైక్‌ హుక్‌అబీ.. రక్షణశాఖ కార్యదర్శి బాధ్యతలను ఫ్యాక్స్‌ న్యూస్‌లో హోస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న పీట్‌ హెగ్సెత్‌కు అప్పగించారు.

అమెరికా జాతీయ భద్రత తదుపరి సలహాదారుగా ఫ్లోరిడా కాంగ్రెస్‌ సభ్యుడు, ఇండియా కాకాస్‌ సహాధ్యక్షుడు మైక్‌ వాల్ట్‌జ్‌ నియామకమయ్యారు.  వాల్ట్‌జ్‌ నియామకం భారత్‌-అమెరికా (Indo US Relations) సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇండియా కాకాస్‌ సహాధ్యక్షులు, డెమొక్రటిక్‌ సభ్యుడు రోఖన్నా అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

Share post:

లేటెస్ట్