మన ఈనాడు:రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన పీఏసీ మీటింగ్ లో నేతలు తీర్మానించారు. సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే మెజార్టీ సీట్లు దక్కుతాయన్న వ్యూహంతో ఈ తీర్మానం చేసినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన తెంగాణ ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ అధినేత్రి సోనియా గాంధీని (Sonia Gandhi) తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేసింది. ఈ రోజు జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ తీర్మానం చేశారు. మెదక్ ఎంపీగా సోనియాగాంధీని పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇందిరా గాంధీ సైతం మెదక్ నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా.. సీట్లు మాత్రం మేజిక్ ఫిగర్ కన్నా కేవలం 5 మాత్రమే ఎక్కువ సాధించింది. దీంతో రానున్న ఎంపీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించి తమ బలం చాటాలని భావిస్తోంది హస్తం పార్టీ. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా సోనియాను పోటీలోకి దించాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.