
ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే (Valentines Day 2025). ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులంతా తమ ప్రేమను వ్యక్తపరిచే రోజు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లవర్స్ అంతా ఆరోజు తమ పార్ట్నర్స్ తో సమయం గడుపుతారు. ఇందుకోసం రకరకాల ప్లాన్లు వేసుకుంటారు. అయితే చాలా మంది తమ లవర్ తో సినిమాకు వెళ్తుంటారు. అందుకోసమే వాలెంటైన్స్ డే స్పెషల్ గా టాలీవుడ్ ప్రేమ పంచేందుకు రెడీ అయింది.
వాలెంటైన్స్ డే హౌస్ ఫుల్
ప్రేమికుల దినోత్సవం రోజున థియేటర్లన్నీహౌస్ ఫుల్ బోర్డు పెట్టేసేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ కు సిద్ధం కాగా.. మరికొన్ని ప్రేమకథలు మరోసారి సినీప్రియుల హృదయాల్ని తాకేందుకు రీ-రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ వాలెంటైన్స్ డే రోజున ప్రేక్షకులను పలకరించేందుకు ఏయే సినిమాలు (Valentines Day Telugu Movies) వస్తున్నాయో ఓ లుక్కేద్దామా..?
లైలా వచ్చేస్తోంది
విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా (Laila)’ ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీలో విశ్వక్ తొలిసారిగా లేడీ గెటప్పులో నటించాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా సందడి చేయనుంది.
బ్రహ్మా ఆనందం పంచేస్తాడు
ఇక ప్రేమికుల రోజున నవ్వులు పంచేందుకు వస్తున్నారు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. ఆయన, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం (Brahma Anandam)’. ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
రష్మిక చావా వచ్చేస్తోంది
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ బ్యూటీ విక్కీ కౌశల్ తో కలిసి ‘చావా(Chhaava)’ చిత్రంలో నటించింది. ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ లవ్ స్టోరీస్
ఇక ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమకథలు చెప్పేందుకు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి మరికొన్ని తెలుగు సినిమాలు. అందులో నేచురల్ స్టార్ నాని నటించిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ‘ఆరెంజ్ (Orange)’, కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ (Surya S/o Krishnan)’, స్టార్ బాయ్ సిద్ధూ ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమాలు ఈ ప్రేమికుల రోజున ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాయి.