
ఈ ఏడాది సంక్రాంతి రేసులో గెలిచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా వెంకటేశ్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు చేసింది. సినిమా విడుదలై దాదాపు నెల రోజులకు దగ్గరపడుతున్నా, ఇప్పటికీ చాలా థియేటర్స్‌లో ఆక్యుపెన్సీ బాగుంది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ ట్విస్ట్
‘సంక్రాంతికి వస్తున్నాం (sankranthiki vasthunam ott release date)’ సినిమా డిజిటల్ పార్ట్నర్ జీ5 ఈ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో ప్రేక్షకులకు ఓ ట్విస్ట్ ఇచ్చింది. ఈ సినిమా ఓటీటీ, డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న జీ5/జీతెలుగు .. తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి రెడీగా ఉండండి’ అంటూ ఆసక్తి రేకెత్తించింది. అయితే ఈ పోస్టుకు ఓటీటీ కన్నా ముందే టీవీలో అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది. ఇది చూసి ఆడియెన్స్ షాక్ అవుతున్నారు.
ముందు టీవీ.. ఆ తర్వాతే ఓటీటీ
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మొదట టెలివిజన్ ప్రీమియర్‌గా అలరించనుంది. ఆ తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందట. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతుండటంతో ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఇటీవల బాగా చక్కర్లు కొట్టాయి. అయితే ఈ పుకార్లన్నింటిని పటాపంచలు చేస్తూ మరో ట్విస్ట్ ఇస్తూ మొదట టెలివిజన్ ప్రీమియర్‌గా రానుంది.
యూట్యూబ్ లో ట్రెండ్
వెంకటేశ్ ప్రధాన పాత్రలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా దాదాపు 17 ఏళ్ల తర్వాత రమణ గోగుల మళ్లీ తన గొంతును తెలుగు ప్రేక్షకులకు వినిపించారు. ఈ సినిమాలో ఆయన పాడిన ‘గోదారి గట్టు’ పాట సూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో ఆ సాంగ్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఇక ఈ మూవీతో వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ కొట్టింది (ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం).