
‘‘ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మా గురువు గారు కె.రాఘవేంద్రరావు కొన్నేళ్ల క్రితమే చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమాపై ఇప్పుడు మీరు చూపిన ఆదరాభిమానాన్ని చూస్తుంటే ఆయన చెప్పింది నిజమైందని అనిపిస్తోంది. ఈ సినిమా ఎవరూ ఊహించనంతగా ప్రేక్షకులకు చేరువైంది. దాదాపు పదేళ్ల నుంచి థియేటర్ ముఖం చూడని వారిని కూడా సినిమా హాళ్లకు రప్పించింది. ఈ సక్సెస్ నిజమా కలా అర్థం కావడం లేదు.” అన్నారు విక్టరీ వెంకటేశ్.
సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్
వెంకటేశ్ (Venkatesh) హీరోగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూవీ రిలీజ్ అయి నెలరోజులు కావొస్తున్నా ఇంకా థియేటర్లలో ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తోందంటే ఈ సినిమా చూపిన ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. అనిల్ రావిపూడి (Anil Ravipudi), వెంకటేశ్ కాంబో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించారు.
2027లో మళ్లీ వస్తాం
ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, హరీశ్‌శంకర్, వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘దేవుడా ఓ మంచి దేవుడా… అంటూ తన డైలాగ్‌తోనే ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూతబడిన థియేటర్లని కూడా కళకళలాడించిందని ఆయన అన్నారు. దర్శకుడు అనిల్, తోటి నటులు, సాంకేతిక బృందం అద్భుతమైన పనితీరుని కనబరిచిందని తెలిపారు. 2027లో మళ్లీ సంక్రాంతికి వస్తాం అని చెప్పిన వెంకీ.. రికార్డులు కొట్టడానికి కాదని.. ప్రేక్షకులకు వినోదం పంచడానికి మాత్రం తప్పకుండా వస్తామని చెప్పారు.