Mana Enadu : 46 ఏళ్ల సినీ ప్రయాణంలో 156 సినిమాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు దక్కిన విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను భావిస్తారన్న విషయం తెలిసిందే. అయితే అసలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఏంటి? ఇది ఎలా నమోదు చేస్తారు? దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలుసుకుందాం పదండి.
గిన్నిస్ రికార్డు అంటే ఏంటి?
పాటలు పాడటంలో రికార్డు.. డ్యాన్సుల్లో రికార్డు.. నటనలో రికార్డు.. రకరకాల కళలు, రంగాల్లో ఎవరూ సాధించని ఫీట్ సాధిస్తే రికార్డు సృష్టించారు అంటారు. అలా రికార్డులకు కూడా ఓ బుక్ ఉండాలని 1950ల్లో సర్ బ్యూ బీవర్ అనే వ్యక్తికి ఆలోచన వచ్చింది. ప్రపంచంలోని వింతలు, విశేషాలు, రికార్డులు చూడటానికి ఓ పుస్తకం ఉంటే బాగుంటుందనే ఆలోచన రావడంతో వెంటనే బీవర్ ఆ ఆలోచనను కార్యరూపం దాల్చే ప్రయత్నం చేశారు.
అందుకు ఆయన నారిస్, రాస్ మెక్విర్టర్ అనే మరో ఇద్దరితో కలిసి 1954లో లండన్‌లోని లడ్గేట్ హౌస్ దగ్గర రెండు గదులతో గిన్నిస్ సూపర్‌లెటివ్స్ పబ్లికేషన్‌ను ప్రారంభించారు. అలా పుట్టిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (Guinness book of world record) 1955లో తొలి పుస్తకం పబ్లిష్ అయింది. ఈ రికార్డ్స్‌ను వారు ఆన్లైన్ రికార్డులు, కంపెనీ- ప్రొడక్ట్ రికార్డులు, భారీ ప్రదర్శనలు, చిన్న లేదా పెద్ద సైజు తయారీలు, టైం రికార్డ్స్ అని 5 కేటగిరీలుగా విభజించారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కు ప్రామాణికమేంటి?
మీరు చేసే ఏ యాక్టివిటీ అయినా దానికి కచ్చితమైన కొలమానం ఉండాలి. లీటర్లు, కిలోమీటర్లు ఇలా ఏదో రకమైన కొలమానం ఉండాలన్నమాట. ఆ యాక్టివిటీ ప్రపంచంలోనే అత్యుత్తమమైందిగా, అప్పటి వరకు ఎవరూ చేయనిదిగా, చేసిన రికార్డును బ్రేక్ చేసేలా ఉండాలి. అలా ఉంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కు అనుమతి లభిస్తుంది.
గిన్నిస్ రికార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records Application) అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘అప్లై’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఓ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, ఊరు, ఫోన్ నెంబర్, మెయిల్ వంటి వివరాలు అప్ లోడ్ చేయాలి. మీరు ఏ ఈవెంట్ లో రికార్డు క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ వివరాలు యాడ్ చేసి సబ్ మిట్ చేస్తే మూడు నెలల్లోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ల నుంచి సమాధానం వస్తుంది. అయితే ఈ రికార్డులను డాక్యుమెంటేషన్, ప్రదర్శన రూపంలో ఇలా రెండు రకాలుగా నమోదు చేస్తారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎలా నమోదు చేస్తారు?
ఉదాహరణకు.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విషయంలో డాక్యుమెంటేషన్ (Documentaion) రూపంలో రికార్డు నమోదు చేశారు. చిరు ఎన్నివేల స్టెప్పులు వేశారు, దానికి ఆధారాలను అప్లికేషన్ కు జత చేయాలి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు వాటిని పరిశీలించి అవి సరైనవని రుజువైతే టైటిల్ అందిస్తారు. ఇక ప్రదర్శన (Live Performance) రికార్డు విషయంలో టైం రికార్డ్స్ చూస్తారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది.
మొదటి విధానంలో.. ఉదాహరణకు ఒక నిమిషంలో మీరు 1000 బెలూన్లు పగులగొడతారు అనుకుందాం. ఆ బెలూన్లు పగులు గొట్టేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్ లేదా వీడియో రికార్డు చేసి పంపాలి. ఈ వీడియో రికార్డు గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిబంధనలు, సూచనల ప్రకారం ఉండాలి. అయితే దీన్ని పరిశీలించి టైటిల్ ఇచ్చేందుకు సమయం పడుతుంది. ఇక రెండో విధానంలో గిన్నిస్ వరల్డ్స్ రికార్డ్స్ ప్రతినిధులు మీ వద్దకే వచ్చి దగ్గరుండి ప్రదర్శనను పరిశీలించి రికార్డు నమోదు చేసి వెంటనే టైటిల్ మీ చేతిలో పెట్టేస్తారు. అయితే ప్రతినిధుల విమాన ప్రయాణ ఖర్చులు, హోటల్, ఫుడ్ వంటివి మీరే చెల్లించాల్సి ఉంటుంది.