ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో టీమ్ఇండియా(Team India) జైత్ర యాత్ర కొనసాగించింది. న్యూజిలాండ్(New Zealand)తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది 6 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అటు గ్రూప్-Aలో 4 పాయింట్లు పొందిన న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది.
కంగారూలకు షాకిస్తుందా?
ఇక గ్రూప్-Bలో టాప్‌లో సౌతాఫ్రికా(South Africa) ఉండగా.. రెండో ప్లేస్‌లో ఆస్ట్రేలియా(Australia) ఉంది. ఇక సెమీఫైనల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 4న తొలి సెమీస్ జరగనుండగా.. మార్చి 5న సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్లు మార్చి 9న జరిగే ఫైనల్ సమరంలో ఢీకొంటాయి. ఇదిలా ఉండగా గత 2023 వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం రేపు భారత్‌కు దక్కింది. సెమీస్‌లో కంగారూలను ఓడించి ఆసీస్‌కు షాక్ ఇవ్వాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వరుణ్ స్పిన్ మ్యాజిక్
ఇక కివీస్‌తో మ్యాచ్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) తన స్పిన్ మ్యాజిక్‌తో ఆకట్టుకున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. అయితే స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ను 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ 44 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.







