Mana Enadu : గత పదిహేను రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Telugu States Rains) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వరణుడు విలయం సృష్టించాడు. భారీ వరదలు ఈ ప్రాంతాల్లో ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశాయి. వరద బాధితుల దీనస్థితి చూసి ఎంతో మంది ప్రముఖులు, ప్రముఖ సంస్థలు, ఎన్జీవోలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి.
వరద బాధితులకు (Flood Victims) సాయం చేసేందుకు పెద్ద ఎత్తున అందరూ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం సహాయనిధికి ఏకంగా రూ.400 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇది ఒక చరిత్ర అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) అన్నారు. తనతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారని తెలిపారు. వరద నీటిలో బాధితులకు అన్నిరకాల సాయం అందించే ప్రయత్నం చేశామని వెల్లడించారు.
విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం (Flood DOnations) అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు తెలిపారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పనిచేయగలిగామని అన్నారు.
ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే.. మరోవైపు బుడమేరు (AP Budameru) నీరు పోటెత్తిందని.. అధికార యంత్రాంగంతో పాటు తాను స్వయంగా బురదలో దిగానని గుర్తు చేశారు. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగామని వెల్లడించారు. విరాళాల కోసం రాష్ట్రప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారన్న చంద్రబాబు.. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారని అన్నారు.