ManaEnadu:అమెరికా (USA)లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు సమీపంలో తాజాగా కాల్పులు (Shooting) జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి గోల్ఫ్ కోర్టులోకి తుపాకీ ఎక్కుపెట్టడం గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని పట్టుకున్నారు. యూఎస్ఏ కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
గోల్ఫ్ కోర్టులో ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ గురించి తెలిసిన వారికి ఆయనకు గోల్ఫ్ (Golf) అంటే ఎంతిష్టమో కూడా తప్పక తెలిసే ఉంటుంది. ఒత్తిడి నుంచి సేద తీరేందుకు ట్రంప్ గోల్ఫ్ ఆడుతుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఆయన అప్పుడప్పుడు గోల్ఫ్ కోర్టులోనే తన సమయం గడుపుతారు. అయితే ఆదివారం (సెప్టెంబరు 15వ తేదీ)న ట్రంప్ తన ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమని ఆయన మధ్యాహ్నం సమయంలో గోల్ఫో కోర్టుకు వెళ్లారు. అప్పటికే సీక్రెట్ ఏజెంట్లు (USA Secret Agents) ఆ గోల్ఫో కోర్టును పాక్షికంగా మూసివేశారు.
ట్రంప్‌పై మరోసారి కాల్పులు!
అయితే ఓ అనుమానిత వ్యక్తి ఆయుధంతో గోల్ఫో కోర్టులోకి తుపాకీ (Gun) ఎక్కుపెట్టడం చూసిన ఏజెంట్లు అతడిపై కాల్పులు జరిపినట్లు అమెరికా పోలీసులు తెలిపారు. అతడు వెంటనే ఎస్‌యూవీలో పరారయ్యేందుకు ప్రయత్నించగా ఏజెంట్లు ఛేజ్ చేసి పట్టుకున్నట్లు వెల్లడించారు. ఘటనాస్థలిలో ఏకే 47 మోడల్ వంటి గన్ను సీజ్ చేసినట్లు చెప్పారు. ట్రంప్‌ను హత్య చేయడానికే దుండగుడు వచ్చినట్లు ఎఫ్‌బీఐ (FBI) తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
కమలా హ్యారిస్ రియాక్షన్
ట్రంప్‌పై మరో హత్యాయత్నం ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) స్పందిస్తూ ఆయన క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. అమెరికాలో హింసకు తావులేదన్న ఆమె.. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్‌కు అధికారుల సమాచారం అందించారని చెప్పారు. మరోవైపు గత జులైలో పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా ట్రంప్ (Trump Shooting News)పై థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో వెంట్రుకవాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నారు. తాజాగా ఆయనకు సమీపంలో మళ్లీ కాల్పుల ఘటన చోటుచేసుకోవడం మరోసారి ఆందోళన రేకెత్తిస్తోంది.








