Mana Enadu : ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి (IAS Aamrapali), వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్‌లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉండగా.. ఏపీలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్, శివశంకర్ తెలంగాణ(Telangana)కు రావాల్సి ఉంది. ఈ మేరకు డీవోపీటీ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులపై ఈ అధికారులు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (CAT)లో పిటిషన్ వేసినా అక్కడ వారికి ఊరట లభించలేదు.
అప్పటి వరకు రిలీవ్ చేయొద్దు
ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రోస్(Ronald Ros), సృజన, హరికిరణ్, శివశంకర్, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ తెలంగాణ హైకోర్టు(Telangana HC)లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వీళ్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్‌ను కొట్టివేసింది. ఐఏఎస్‌ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ట్రైబ్యునల్‌లో నవంబరు 4న విచారణ ఉందని అప్పటివరకు అధికారులను రిలీవ్ చేయవద్దని న్యాయస్థానాన్ని కోరారు.
స్టే ఇస్తూ పోతే ఎన్నటికీ తేలదు
స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వివాదాన్ని తేలుస్తామని.. ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని అధికారులకు సూచించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరంతా బాధ్యతాయుతమైన అధికారులు. ప్రజలకు ఇబ్బంది కలగనీయొద్దు. ఎవరు ఎక్కడ పనిచేయాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది. మరోసారి పరిశీలించాలని డీవోపీటీ(DOPT)ని ఆదేశించమంటారా? ’’ అని ధర్మాసనం అడిగింది.
హైకోర్టులోనూ దక్కని ఊరట
రీలీవ్ చేసేందుకు 15 రోజుల గడువు ఇవ్వాలని రెండు రాష్ట్రాలు డీవోపీటీని కోరాయని ఐఏఎస్‌ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలుపుతూ.. క్యాట్ తుది తీర్పు ఇచ్చే వరకు రిలీవ్ చేయవద్దని కోరారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం(Union Govt) తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగులు ఎక్కడ పని చేయాలో కోర్టులు నిర్ణయించవద్దని అన్నారు. డీవోపీటీ నిర్ణయం ఎలా సరైందో పూర్తి వివరాలతో క్యాట్‌లో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ఐఏఎస్ అధికారుల పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.