Mana Enadu : తెలంగాణ కుంభమేళగా పేరు గాంచింది మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram Jatara). ప్రతి రెండేళ్లకోసారి మహా జాతరగా, ఏడాదికోసారి మినీ జాతర జరుపుకుంటాం. తాజాగా ఈసారి సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. 2025 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజులు మినీ జాతరను నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు
మినీ మేడారం జాతర(Medaram Mini Jatara)లో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారన్న విషయం తెలిసిందే. గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేయగా.. భక్తులు గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే తేదీలు ఖరారు చేసిన అనంతరం పూజారులు ఆలయ ఈవోకు ఆహ్వాన పత్రం పంపారు. మినీ మేడారం జాతర(Sammakka Saralamma)కు కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
దేశ నలుమూలల నుంచి రానున్న భక్తులు
ఇక సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర(Maharashtra), ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన మేడారం జన జాతరను 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జరిగే మినీ జాతరకు వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు, రవాణా, భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
ఇదీ మేడారం జాతర కథ
కాకతీయ రాజ్య సైన్యం గిరిపుత్రులను వేధిస్తుంటే సమ్మక్క సారలమ్మ కత్తిపట్టి కదనరంగంలోకి దూకి వారి అంతుచూశారు. ఆ క్రమంలో వారు వీరమరణం పొందడంతో వారి త్యాగానికి నీరాజనాలు పలుకుతూ గిరిజనులు వారిని దేవతలుగా పూజిస్తూ మేడారంలో జాతర(Sammakka Saralamma Jatara) నిర్వహిస్తున్నారు. అయితే 1944 వరకు ఆదివాసి గిరిజనులకే ఈ జాతర పరిమితమైంది. క్రమంగా మేడారం మహత్యం, సమ్మక్క సారలమ్మల మహత్యం గురించి తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మేడారం జాతర జనసంద్రంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది.






