
నిత్యం ఏదో చోటా పలువురు ప్రభుత్వ అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కుతూనే ఉన్నారు. ఏసీబీ నిత్యం నిఘా పెడుతున్నా కొందరు తమ చేతివాటం చూపించడం మాత్రం మానేయడం లేదు. కొందరు అధికారుల నిఘాకు చిక్కుతుంటే.. మరికొందరు బాధితుల ఫిర్యాదుతో దొరికిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
పత్తి కూపన్ కు రూ.30వేలు
జిల్లాలోని అశ్వాపురం మండలంలో వ్యవసాయ అధికారి (Agriculture Officer) సాయి శంతన్ కుమార్ వద్దకు ఓ పత్తి రైతు వచ్చాడు. అతడు తన పంటను అమ్ముకునేందుకు అధికారిని కూపన్ ఇవ్వాలని కోరాడు. అయితే తనకు రూ.30వేలు ఇస్తేనే కూపన్ ఇస్తానని సదరు అధికారి లంచం డిమాండ్ చేశాడు. చేసేదేం లేక ఆ రైతు నగదు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు.
ఏసీబీకి చిక్కిన అధికారి
విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు (ACB Raid) సదరు వ్యవసాయ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ఇవాళ రైతు అధికారి సాయి శంతన్ కుమార్ కు నగదు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.