Mana Enadu:సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్‌లో వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. మంగళవారం రోజున ఆ దేశ పార్లమెంట్‌ను రద్దు చేసిన అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ అర్ధరాత్రి సమయంలో తాత్కాలిక ప్రభుత్వ పగ్గాలను నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్‌కు అప్పగించారు. రిజర్వేషన్ల కోటా విషయంలో చెలరేగిన అల్లర్లు ఘర్షణలకు దారి తీసి వందల మంది ప్రాణాలు బలవ్వడంతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి వచ్చింది. ఆమె రాజీనామాతో అధ్యక్షుడు .. తొలుత తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్ యూనివర్సిటీకి 2012 నుంచి 2018 వరకు వీసీగా పనిచేసిన యూనస్.. ఆ తర్వాత చిట్టగాంగ్ వర్సిటీలో ఆర్థిక శాశ్త్ర ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే బంగ్లాదేశ్‌లోని పేదల అభివృద్ధి కోసం కృషి చేశారు. మైక్రోఫైనాన్స్ బ్యాంకింగ్ ద్వారా లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేశారు. ఆయన చేసిన సేవలకు గాను 2006లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.

పార్లమెంటును రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఉద్యమకారులు.. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనస్ పేరును ప్రతిపాదించారు. తమకు సైనిక సర్కార్ వద్దని.. సైన్యం మద్దతు ఉండే ప్రభుత్వం అసలే వద్దని తేల్చి చెప్పారు. మరోవైపు తన దేశం, ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని చెబుతున్న యూనస్.. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని ఆయన అన్నారు. హసీనా సర్కారుతో ఘర్షణ పడినందుకు యూనస్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో అయితే సుమారు ఆరు నెలల జైలుశిక్ష పడింది.
మరోవైపు ఆర్మీలో అత్యున్నత స్థానాల్లో భారీ మార్పులు చేసింది బంగ్లాదేశ్. నేషనల్ టెలికమ్యూనికేషన్ మానిటరింగ్ సెంటర్ (NTMC) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ జియావుల్ అహ్సాన్ను విధుల నుంచి తొలగించింది. లెఫ్టినెంట్ జనరల్ ఎండీ సైఫుల్ ఆలమ్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అహ్మద్ తబ్రేజ్ షామ్స్ చౌదరి, ఆర్మీ క్వార్టర్‌మాస్టర్ జనరల్‌గా, GOC ఆర్మీ ట్రైనింగ్ అండ్ డాక్ట్రిన్ కమాండ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎండీ మోజిబుర్ రెహ్మాన్ , ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మిజానూర్ రెహమాన్ షమీమ్, కమాండెంట్ ఎన్‌డీసీగా లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ షాహినుల్ హక్, ఎన్‌టీఎంసీ డైరెక్టర్ జనరల్‌గా మేజర్ జనరల్ ఎఎస్ఎమ్ రిద్వానుర్ రెహమాన్‌ను నియమించారు.








