ManaEnadu:మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం (2019లో) జస్టిస్ హేమ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నివేదిక ప్రభుత్వానికి అందినా అందులోని విషయాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన ఆ నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మలయాళ చిత్రసీమలో పనిచేసే మహిళలు వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారని ఈ నివేదిక తేల్చింది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. అవకాశాలు కావాలంటే తమ కోరికలు తీర్చాలని కొంతమంది బడా నిర్మాతలు, దర్శకులు తమను వేధించే వారని కొందరు బాధితులు ఆరోపించినట్లు జస్టిస్ హేమ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. మత్తులో జోగుతూ బాధిత మహిళల రూమ్ తలుపు తట్టేవారని.. అలా అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యారని పేర్కొంది.
అసలు ఈ కమిటీ ఎలా ఏర్పాటైంది..?
2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. కారులో సదరు నటిపై లైంగిక వేధింపులు పాల్పడినట్లు నటుడు దిలీప్‌పై ఆరోపణలు రాగా అతడు అరెస్టయ్యాడు. ఇక అదే సమయంలో మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి ఈ విషయాలపై అధ్యయనం చేయాలని ఆదేశించింది. అయితే ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినా.. ఇన్నాళ్లూ ఆ రిపోర్టులో విషయాలు బయటకు రాలేదు.
జస్టిస్ హేమ రిపోర్టులో బయటకు వచ్చిన మరికొన్ని షాకింగ్ విషయాలు ఇవే..
లైంగిక కోరికలు తీర్చకపోతే సినిమాల్లో ఛాన్సులు ఇవ్వరు
ఇండస్ట్రీకి చెందిన కొంతమంది డ్రగ్స్ సేవించి, తప్పతాగి హీరోయిన్ల ఇళ్ల తలుపులు కొట్టి లైంగికంగా వేధించిన కొన్ని సందర్భాలున్నాయి. ఇలాంటి కేసుల్లో బడా నిర్మాతలు, దర్శకులు, కొందరు హీరోలు కూడా ఉన్నారు.
హీరోయిన్లపై కోపం ఉంటే వారికి రిపీట్ షాట్లు ఇస్తారు. ఓ నటికి ఒకే షాట్‌ను 17 సార్లు రీటేక్ చేయించి వేధించిన సందర్భం ఉంది.
ఇండస్ట్రీలో కొందరి డిమాండ్లకు తలొగ్గేందుకు రెడీగా ఉన్న మహిళలను కోడ్ పేర్లతో పిలుస్తారు.
కుటుంబ సభ్యులకు ముప్పు వాటిల్లుతుందని, ప్రాణాలకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధితులు బయటకు రావడం లేదు.
మలయాళ చిత్ర పరిశ్రమ క్రిమినల్ గ్యాంగ్ నియంత్రణలో ఉంది.