Mana Enadu: ఒక కుటుంబం వృద్ధి చెందాలంటే దంపతులకు సంతానం ఉండాల్సిందే. ఒకప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలు డజన్ల కొద్దీ జనం ఒకే ఇంట్లో కలిసిమెలిసీ ఉండేవారు. చిన్నాపెద్దా, ముసలి ముతకా అందరూ ఒకేచోట ఉండి ఉన్నదాంట్లో తిని హాయిగా, సంతోషంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఉమ్మడి కుటుంబం సంగతి పక్కన పెడితే కనీసం భార్యభర్తలు కలిసి ఉండటానికి సమయం దొరకని పరిస్థితి నెలకొంది. బిజీ లైఫ్, పెరుగుతున్న ఆర్థిక అవసరాల కారణంగా ఆలూమగలు ఇద్దరూ జాబ్ చేయాల్సిన సిచ్యుయేషన్ తయారైంది. దీంతో పని ఒత్తిడి, పర్యావరణ కాలుష్యం, తీసుకునే ఆహారం వల్ల పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదు. దీనికి కారణాలు అనేకం. కానీ సమాజంలో మాత్రం ఓ తరహా చిన్నచూపు పిల్లలు లేనివారిపై తప్పక ఉంటుందనేది కాదనలేని నిజం.
అయితే ఒకప్పుడు సంతానలేమి సమస్యలు మగవారిలో ఉంటాయని భావించే వారు. అందుకు తగ్గట్టే ప్రస్తుతం పరిస్థితులు అలాగే తయారయ్యాయి. పురుషుల్లో సంతానలేమి సమస్యలు అధికమయ్యాయి. ఇదేదో ఊరికే చెబుతున్న మాటలు కాదు. ఎన్నో సర్వేల్లో తేలిన కాదనలేని నిజాలు. ఇందుకు కారణం మారిన జీవిన విధానం ఒకటి. నిద్రలేమి, శారీరక వ్యాయామం తగ్గడం, వేడి ఎక్కువగా ఉన్ననిచేయడం ఇలా రకరకాల అంశాలు దీనికి కారణాలవుతున్నాయి. శుక్రకణాల నాణ్యతతో పాటు కౌంట్ తగ్గడం వల్ల సంతానలేమీ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక పురుషుడికి సంతానలేమి సమస్య ఉండొద్దంటే శుక్ర కణాల సంఖ్య ఎంత ఉండాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటన చేసింది. ఒక ml వీర్యంలో 1.5 కోట్ల శుక్ర కణాలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సంఖ్య తగ్గితే తండ్రి కావడంలో ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 40 శాతం శుక్ర కణాలు అండాన్ని చేరుకుంటనే, గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయని తాజా సర్వేల్లో తేలింది.
అందుకు కారణాలు అనేకం..
ఇంతకీ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ముఖ్యంగా స్మోకింగ్, మద్యం తాగే వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఒక కారణమని అంటున్నారు. పురుషుల సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అసమతుల్యత కారణంగా కూడా స్మెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ప్రైవేట్ భాగాలలో ఇన్ఫెక్షన్, పలు రకాల లైంగిక వ్యాధుల కారణంగా కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. శుక్రకణాల సంఖ్యతో పాటు, నాణ్యత పెరగాలంటే స్మోకింగ్‌ను పూర్తిగా మానేయాలి. అలాగే వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పనిచేయకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని ఉపయోగించకూడదు, పాటించడమే ఉత్తమం. దీంతో పాటు తాజా పండ్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. రోజూ వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే శరీరంపై ఒత్తిడి తగ్గి మంచి ఆరోగ్యం మీ సొంతమై, సంతాన సమస్యలు తీరుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.