
బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావు (Ranya Rao) వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. నటి రన్యారావు శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయని తెలిపారు. రన్యారావు వీఐపీ ప్రోటోకాల్స్‌ను దుర్వినియోగం చేస్తూ గోల్డ్ స్మగ్లింగ్ దందాలో భాగమైనట్లు గుర్తించామని చెప్పారు.
రన్యారావుకు గాయాలు
నటి రన్యారావు శరీరంపై గాయాలున్నాయని తెలిపిన అధికారులు.. దుబాయ్‌కి వెళ్లడానికి చాలాకాలం ముందే తనకు ఈ గాయాలు అయ్యాయని ఆమె చెప్పిందని వెల్లడించారు. ఈ క్రమంలో అవసరమైన వైద్య సాయం అందించాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితురాలు విచారణకు పూర్తిగా సహకరించడం లేదని డీఆర్‌ఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మూడు రోజులపాటు విచారించేందుకు డీఆర్‌ఐకు అనుమతిస్తూ సంబంధిత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది.
సంఘవిద్రోహ శక్తులతో సంబంధాలు
ఇక రన్యారావు ఎక్కువసార్లు దుబాయ్ కు వెళ్లడం గుర్తించిన అధికారులు ఆమెపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆమెను ఎయిర్ పోర్టులో పట్టుకుని తనిఖీ చేయగా ఆమె వద్ద బంగారం దొరికింది. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేసిన అనంతరం ఆమె నివాసంలో సోదాలు చేయగా భారీగా బంగారం, నగదు లభించింది. ఈ నేపథ్యంలో డీఆర్‌ఐ అధికారులు ఇప్పటికే 14.2 కిలోల బంగారు బిస్కెట్లు, సుమారు రూ.2.06 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సంఘవిద్రోహ శక్తులతో రన్యారావుకు సంబంధాలున్నాయని ప్రాథమిక విచారణలో గుర్తించిన అధికారులు ఆ దిశగానూ విచారణ జరుపుతున్నారు.