
ఏపీ విద్యార్థులకు అలర్ట్. ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) నోటిఫికేషన్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అపరాధ రుసుముతో మే 16వ తేదీ వరకు అవకాశం ఉందని వెల్లడించారు. దరఖాస్తులో తప్పుల సవరణకు మే 6 నుంచి 8 వరకు సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు
‘మనమిత్ర (Mana Mitra)’ వాట్సాప్ ద్వారా అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందొచ్చని అధికారులు చెప్పారు. వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 19, 20 తేదీల్లో రోజుకు రెండు విడతలుగా ఉంటుందని.. ఇంజినీరింగ్ (Engineering) ఎగ్జామ్ మే 21 నుంచి 27 వరకు రోజుకు రెండు విడతలుగా నిర్వహిస్తామని తెలిపారు. వ్యవసాయ, ఫార్మసీ పరీక్ష (Pharmacy) ప్రాథమిక ‘కీ’ని మే 21న, ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ని మే 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తుది ‘కీ’ని జూన్ 5న విడుదల చేస్తామని అధికారులు వివరించారు.
ముఖ్యమైన తేదీలివే..
- మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు దరఖాస్తుల స్వీకరణ
- అపరాధ రుసుంతో మే 16 వరకు అవకాశం
- దరఖాస్తులో తప్పుల సవరణకు మే 6 నుంచి 8 వరకు సమయం
- వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీ మే 19, 20
- మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు
- మే 21న వ్యవసాయ, ఫార్మసీ పరీక్ష ప్రాథమిక ‘కీ’
- మే 28న ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ని
- జూన్ 5న తుది ‘కీ’ విడుదల