Mana Enadu: భారతీయ సినీ ఇండస్ట్రీ మరో అద్భుత నటిని కోల్పోయింది. ప్రముఖ నటి ఆశా శర్మ (88) కన్నుమూశారు. దీంతో బాలీవుడ్, టీవీ పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని CINTAA (సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో అధికారికంగా ప్రకటించింది. ఆశాకు టీవీ ప్రపంచంలో సుపరిచితమైన పేరుంది. తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను ఆమె సంపాదించుకున్నారు. ఆమె మరణ వార్తను ధృవీకరిస్తూ, శర్మ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ CINTAA ఆగస్టు 25, 2024 మధ్యాహ్నం 3:01 గంటలకు ట్వీట్ చేసింది. “ఆశా శర్మ మృతికి CINTAA సంతాపాన్ని తెలియజేస్తోంది. ఆమె మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు” అని రాసుకొచ్చింది.
40కి పైగా చిత్రాల్లో నటించారు..
దివంగత నటి ఆశా చాలా సంవత్సరాలుగా సినిమాలు, టెలివిజన్ షోల ద్వారా ప్రజలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా అమ్మ, అమ్మమ్మ పాత్రల్లో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. టీవీతో పాటు, ధర్మేంద్ర, హేమ మాలినీల చిత్రం ‘దో దిశాయీన్’లో ఆశా అద్భుతంగా నటించారు. దీంతోపాటు ఆమె అనేక చిత్రాలలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఆమె నటించిన ‘ముఝే కుచ్ కెహనా హై’, ‘ప్యార్ తో హోనా హి థా’, ‘హమ్ తుమ్హారే హై సనమ్’ వంటి సినిమాలు అభిమానులను అలరించాయి. ఆమె చివరిగా ప్రభాస్, కృతి సనన్ల ‘ఆదిపురుష్’ చిత్రంలో నటించారు. అలాగే ‘కుంకుమ్ భాగ్య’, ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’, ‘ఏక్ ఔర్ మహాభారత్’ వంటి టీవీ షోలలో అలరించారు. ఆశా శర్మ తన కెరీర్లో నాలుగు దశాబ్దాలుగా దాదాపు 40 సినిమాలు, వందల టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆశా మృతికి బాలీవుడ్, టాలీవుడ్ సినీ పరిశ్రమలు సంతాపం ప్రకటించాయి.







