ManaEnadu:ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిశీ (Atishi Marlena) దిల్లీ ముఖ్యమంత్రిగా ఈ నెల 21వ తేదీన ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఆమె ప్రమాణ స్వీకారానికి ఈ తేదీని ప్రతిపాదించిన లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా అదే విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) కు బుధవారం రోజున తెలియజేశారని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు దిల్లీ సీఎంగా అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ కేజ్రీవాల్ సమర్పించిన లేఖను కూడా రాష్ట్రపతికి సక్సేనా పంపించారని వెల్లడించాయి.
దిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు (Supreme Court) గత శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని, ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, సంతకాలు చేయొద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన కేజ్రీవాల్ (Kejriwal), మరో 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన చేశారు. న్యాయస్థానం నుంచి న్యాయం దక్కిందనీ, ప్రజల నుంచి న్యాయం జరగాల్సిన సమయం వచ్చిందని పేర్కొంటూ.. ప్రజలు తమను నిజాయతీ పరులుగా అంగీకరించేవరకు సీఎం సీటులో కూర్చోబోనని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఈనెల 17వ తేదీన దిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. అదే రోజు సాయంత్రం లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Delhi LG VK Saxena)ను కలిసిన కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ రోజు ఉదయం కేజ్రీవాల్ నివాసంలో పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ మార్లెనా సింగ్ పేరును ఖరారు చేశారు. ఆతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. షీలా దీక్షిత్ తర్వాత దిల్లీలో మహిళా సీఎంగా ఆతిశీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ విధులు నిర్వర్తించనున్నారు.






