Mana Enadu : ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’, ‘చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ’, ‘రామరామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో’... ఇలా తెలంగాణ పూల సంబురం బతుకమ్మ పండుగ (Bathukamma Festival) రోజు మహిళలంతా ఓ చోట చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ సంబురాలు చేసుకుంటారు. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణకు మాత్రమే సొంతం.
పూలనే దైవంగా కొలిచే పండుగ
సాధారణంగా దేవుళ్లను పూలతో పూజించడం ఆనవాయితీ. కానీ పూలనే దైవంగా కొలిచే సంస్కృతి కేవలం తెలంగాణ(Telangana)కే సొంతం, పూలను బతుకమ్మగా, గౌరమ్మగా భావించి భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. మరి ఈ బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు..? ఈ పండుగ విశిష్టత ఏంటో తెలుసుకుందామా?
9 రోజుల బతుకమ్మ సంబురం
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ రోజుల్లో ఆడవాళ్లంతా రంగురంగుల పూలతో బతుకమ్మ(Bathukamma)ను త్రికోణారంలో పేర్చి ఆ బతుకమ్మలను ఓచోట పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుతూ చప్పట్లు చరుస్తూ, కోలాటాలాడుతూ సంబురాలు చేసుకుంటారు. ఈ సంబురాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి.
నేటి నుంచి ఈనెల 10వరకు
భాద్రపద బహుళ అమావాస్య అంటే మహాలయ అమావాస్య నుంచి బతుకమ్మ వేడుకలు మొదలై ఆశ్వయుజ శుద్ధ అష్టమి (Durgashtami) పర్వదినంతో ముగుస్తాయి. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి మొదలై అక్టోబర్ 10వ తేదీతో ముగియనున్నాయి. ఈ తొమ్మిది రోజులు ఈ పండుగను ఎలా జరుపుకుంటారంటే..?
DAY-1 : ఎంగిలి పూల బతుకమ్మ : మహాలయ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని ‘పెత్రామస’ అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు.
DAY 2 : అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మ వేడుక జరుపుకుంటారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
DAY 3 : ముద్దపప్పు బతుకమ్మ : మూడో రోజు ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు పెడతారు.
DAY 4 : నానే బియ్యం బతుకమ్మ : నానపెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేసి బతుకమ్మకు నివేదిస్తారు.
DAY 5 : అట్ల బతుకమ్మ : బతుకమ్మకు అట్లు లేదా దోశలు నైవేద్యంగా పెడతారు.
DAY 6 : అలిగిన బతుకమ్మ : ఆరోరోజున అమ్మవారు అలిగి ఉంటారని ఏమి తినరని.. అందుకే నైవేద్యమేమి సమర్పించరు.
DAY 7 : వేపకాయల బతుకమ్మ : వేపకాయల బతుకమ్మకు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్ల ఆకారంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
DAY 8 : వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు పెడతారు.
DAY 9 : సద్దుల బతుకమ్మ : దుర్గాష్టమి మహా పర్వదినం రోజున బతుకమ్మకు.. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం. ఇలా ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు.