Mana Enadu : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు స్పందన, చెరువులు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా (HYDRA)కు ప్రభుత్వం మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఇటీవలే ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌కు తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. గవర్నర్ (Governor) రాజముద్రతో హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చాయి. ఇకపై ఇది చేపట్టే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించినట్లైంది.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టం
ఆ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly) ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అప్పటివరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్‌కు పంపారు. అయితే గవర్నర్ ఇందులో పలు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ (Dana Kishore) నివృత్తి చేశారు. ఆ సమాధానాలతో సంతృప్తి చెందిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా ఆమోద ముద్ర వేశారు.
హైడ్రాకు మరిన్ని పవర్స్
చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు (Govt Lands), ఆటస్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం సహా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు (Heavy Rains) వచ్చినప్పడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. అగ్నిమాపకశాఖ సేవలకు ఎన్ఓసీ జారీ లక్ష్యంతోనూ జులై 19న జీవో ఎమ్ఎస్ 99 ద్వారా దీన్ని ఏర్పాటు చేసిన సర్కార్.. రంగారెడ్డి, హైదరాబాద్ (Hyderabad), మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పరిధిలో ORR వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు.
హైడ్రా అదనపు పవర్స్ ఇవే
ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 374బీ ని ఆర్డినెన్స్‌లో చేర్చిన ప్రభుత్వం.. అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకు ఇచ్చింది. పురపాలక చట్టం-2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్‌కు ఉన్న అధికారాలను కూడా కట్టబెట్టింది. ఇక బీపాస్ చట్టం-2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్‌ఫోర్స్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు ఉన్న అధికారాలను హైడ్రాకు అప్పజెప్పారు. ఇలా మరిన్ని పవర్స్ తో హైడ్రా మరింత పవర్ ఫుల్ గా తయారైంది.






