మన ఈనాడు:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు భారతీయ జనతా పార్టీకి వరుసగా ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. డీకే అరుణ, విజయశాంతి కూడా కమలం పార్టీ వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిద్దరు కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) రాజీనామా నుంచి ఇంకా తేరుకోకముందే.. భాజపాకు(BJP) మరో గట్టి షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కీలక నేతలు డీకే అరుణ, విజయశాంతి (Vijayashanthi) లు సైతం పార్టీ వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరు మహిళా నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి పోటీ చేస్తే గద్వాలలో తన గెలుపు సులువుగ ఉండదని డీకే అరుణ (DK Aruna) భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఫస్ట్ లిస్ట్ తర్వాత పార్టీ తీరుపై డీకే అరుణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరో నేత విజయశాంతి కూడా పార్టీలో జరిగే పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సరైన గుర్తింపు రావడం లేదని ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆమె కొన్ని రోజులుగా వరుస ట్వీట్లు చేస్తున్నారు.
ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. డీకే అరుణకు వేరే సీటును కేటాయిస్తారా? లేదా గద్వాల అభ్యర్థిని మారుస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకటి లేదా రెండు రోజుల్లో కాంగ్రెస్ లో డీకే అరుణ చేరిక.. ఆమె పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయశాంతి మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.|