తెలంగాణ: ఇంటింటి ప్రచారాలు, లోకల్ లీడర్లకు తాయిలాలు, కులసంఘాలకు నిధులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. వారం కిందటి దాకా రాష్ట్రమంతటా ఇదే వాతావరణం. రేపోమాపో ఎన్నికలన్నంత హడావుడి చేసిన గులాబీ నేతలు ఉన్నట్టుండి చల్లబడ్డారు.
ప్రచారాలకు విరామమిచ్చి, నియోజకవర్గాలు వదిలి తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. ఇందుకు గులాబీ బాస్ ఇచ్చిన ఆదేశాలే కారణమట. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరశంఖం పూరించిన కేసీఆర్.. ప్రకటించిన రోజు నుంచే ప్రచారం మొదలు పెట్టాలని సూచించారు. దీంతో నేతలంతా హడావుడి పర్యటనలు, గెలుపు ప్రణాళికలతో బిజీ అయిపోయారు. అయితే, ఉన్నట్టుండి కేంద్ర సర్కారు జమిలీ ఎన్నికలను మళ్లీ తెరమీదకి తేవడంతో పాటు రేపు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ఆమోదానికి సాయం కావాలని పలు పార్టీలను కోరింది. అందులో భారాస కూడా ఉందని సమాచారం.
ఇప్పటికే భారాస ఎంపీలకు ఈమేరకు కేసీఆర్ ఆదేశాలిచ్చారట.. జమిలీ వస్తే దేశమంతటా డిసెంబరు చివరి వారం నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి జనవరి రెండో వారానికి ఎన్నికలు పూర్తయ్యే అవకాశముందని సమాచారం.
జమిలీ మద్దతుకు సిద్ధమైన ప్రాంతీయ పార్టీల్లో భారాస మొదటిది కాగా.. జమిలీ వస్తే తమకే కలిసి వస్తుందని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటి నుంచే ఖర్చు పెడితే ఎన్నికల సమయానికి ప్రయోజనం కనిపించదని, నవంబరు వరకు ఓపిక పట్టాలని.. ఖర్చులకు దూరంగా ఉంటూ నియోజకవర్గానికి దగ్గరగా ఉండాలని మరోసారి ఆదేశాలిచ్చినట్టు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఒకరు మన ఈనాడుకు తెలిపారు. అందుకే అభ్యర్థులు వెనక్కి తగ్గారని ఆ నేత చెప్పుకొచ్చారు.
* పాపం ఈ ఎమ్మెల్యేలు..!
ఇప్పటివరకు ఖర్చు పెట్టినవారిలో మేడ్చల్ మొదటిస్థానంలో ఉండగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ రెండోస్థానంలో ఉంది. ఇక్కడి భారాస అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. కమ్మరిపెల్లిలో పలు కులసంఘాలకు రూ.4లక్షల నుంచి రూ.5లక్షల దాకా ఇచ్చినట్లు సమాచారం. ఏర్గట్ల,వేల్పూర్, ముప్కాల్ మండలాలలో వివిధ గ్రామాలకు సుమారు 82లక్షలతో వివిధ కులసంఘాల భవన నిర్మాణాల నిధుల ప్రొసీడింగ్ కాపీలను ఇప్పటికే అందజేశారు.
ఇంత ఖర్చుపెట్టినా బాల్కొండ అంతటా మంత్రికి ఎదురుగాలి వీస్తుండటం కొసమెరుపు. ఇక్కడ ఎమ్మెల్సీ కవిత అనుయాయునిగా ఉండి, స్థానికంగా వ్యక్తిగత చరిష్మా ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున బరిలో నిలవనున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా కొద్దిపాటి తేడాతో ఓడిపోవడంతో కలిసొస్తుందని భావిస్తుండగా.. భాజపా నుంచి ఏలేటి మల్లిఖార్జున్ రెడ్డి కూడా గట్టిపోటీనిస్తున్నారు. దీంతో మంత్రికి ఎదురుగాలి తప్పదనే మాట గట్టిగా వినిపిస్తోంది.
జగిత్యాల జిల్లా పరిధిలో జగిత్యాల, కోరుట్ల స్థానాల భారాస అభ్యర్థులు ఇప్పటికే రూ.50లక్షల దాకా ఖర్చు పెట్టేసినట్లు సమాచారం. పలు కులసంఘాల భవనాలు, యూత్ అసోసియేషన్లకు తాయిలాలు, దేవాలయాల నిర్మాణాలకు వీటిని వినియోగించగా.. మరో రూ.కోటిన్నర దాకా ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ధర్మపురిలో రెండోశ్రేణి నేతలకు ఇప్పటికే ముడుపులు అందినట్లు తెలిసింది.