ManaEnadu : అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. ఇరువురి నేతల ప్రచారంతో అగ్రరాజ్యం హోరెత్తుతోంది. విమర్శలు ప్రతివిమర్శలు, డిబేట్లు, దాడులతో అమెరికా రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
ట్రంప్‌నకు మస్క్ మద్దతు
అయితే ఇటు ట్రంప్‌న (Donald Trump)కు అటు కమలా హారిస్‌కు పలువురు ప్రముఖులు, అమెరికా ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో మొదటి నుంచి టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపునకు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయనతో కలిసి ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. ట్రంప్ విధానాలను ప్రశంసిస్తూ అలాంటి నాయకుడే అమెరికాకు కావాల్సింది అంటూ భారీగానే క్యాంపెయినింగ్ చేస్తున్నారు.
బాస్ అటువైపు.. ఉద్యోగులు ఇటువైపు
అయితే మస్క్ మద్దతు ట్రంప్‌నకే ఉన్నప్పటికి.. టెస్లా (Tesla), స్పేస్‌ఎక్స్ (Space X) ఉద్యోగుల అభిప్రాయం మాత్రం తమ బాస్‌కు భిన్నంగా ఉంది. ఈ ఉద్యోగులంతా తమ ఓటు కమలా హారిస్ (Kamala Harris)కేనంటూ ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. టెస్లా ఉద్యోగులు అధ్యక్ష అభ్యర్థులకు ఇచ్చిన ప్రచార విరాళాల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు ఓపెన్ సీక్రెట్ నివేదిక వెల్లడించింది.
హారిస్‌కే భారీ విరాళాలు
ఈ నివేదిక ప్రకారం.. మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ ఉద్యోగులు ట్రంప్ కంటే కమలా హారిస్‌కు భారీగా విరాళాలు (US Election Donations) అందించినట్లు సమాచారం. టెస్లా ఉద్యోగులు ట్రంప్ కోసం 24,840 డాలర్లు.. కమలా హారిస్‌కు 42,824 డాలర్లు అందించగా.. స్పేస్ ఎక్స్ ఉద్యోగులు ట్రంప్‌కు 7,652 డాలర్లు ఇవ్వగా.. హారిస్‌కు 34,526 డాలర్లు విరాళం ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఎక్స్ ఉద్యోగులు (X Employees) 13,213 డాలర్లు .. ట్రంప్‌నకు 500 డాలర్ల కంటే తక్కువే విరాళంగా అందించినట్లు ఈ నివేదిక పేర్కొంది. మస్క్ ఉద్యోగుల్లో చాలామంది డెమోక్రాటిక్ (US Democratic Party)కు బలమైన కాలిఫోర్నియాలో ఉండటమే ఇందుకు కారణమని సమాచారం.