బెంగళూరు బాబులకు క్రేజీ ఆఫర్.. రూ.1కే ఆటో రైడ్‌

Mana Enadu : సాధారణంగా ఆటోలో ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సుల కంటే ఛార్జీలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అదే దూర ప్రాంతాలైతే ఇక ఆస్తులడిగేస్తారు ఆటో (Auto Ride) డ్రైవర్లు. కానీ బెంగళూరులో మాత్రం కేవలం ఒక్క రూపాయికే ఎక్కిడికి కావలంటే అక్కడికి హాయిగా తిరిగేయొచ్చు. ఆ నగర వాసులు ఈ క్రేజీ ఆఫర్ ను ఉపయోగించుకుని ఎంచక్కా నగరంలో తిరుగుతున్నారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి..?

బెంగళూరు వాసులకు ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) రూ.1 కే ఆటో రైడ్‌ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’సేల్‌ సందర్భంగా యూపీఐ పేమెంట్స్‌ ప్రమోషన్‌లో భాగంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చిన సంస్థ.. ఇందుకోసం స్థానిక ఆటో డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆఫర్ లో భాగంగా ఒక్క రూపాయికే ఆటో రైడ్‌ (One Rupee Auto Ride) అందిస్తోంది. నగరవ్యాప్తంగా దీనికి భారీ స్పందన లభిస్తోంది. కేవలం రూపాయి చెల్లించి ఆటో బుక్‌ చేసుకొని నగరంలో ఎంచక్కా తిరుగుతున్నారు.

ఈ వన్ రూపీ ఆటో రైడ్‌ల కోసం భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఆఫర్ (Flipkart One Rupee Auto Ride) కు అద్భుత స్పందన లభించిందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. రద్దీ సమయాల్లో సులభతర ప్రయాణం కోసం, అలాగే క్యాష్‌లెస్‌ సేవలను ప్రమోట్‌ చేసేందుకు దీన్ని తీసుకొచ్చామని వెల్లడించింది. “రూపాయికి కనీసం చాక్లెట్ కూడా దొరకని ఈ సమయంలో వన్ రూపీ ఆటో రైడ్ ప్రచారం హిస్టరీ క్రియేట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ యూపీఐ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో చూపిస్తూ జీవితాన్ని సులభతరం చేస్తోంది. చౌకగా లభిస్తోంది’’ అని సదరు సంస్థ వెల్లడించింది.

ఈ ఆఫర్‌ కేవలం బెంగళూరు (Benguluru) నగరానికే పరిమితమడంతో ఇతర ప్రాంతాల వాసులు ఫ్లిప్‌కార్ట్‌కు తెగ రిక్వెస్టులు పంపుతున్నారు. ఇలాంటి ఆఫర్లే తమ నగరాల్లో ప్రవేశపెట్టాలని కోరుతూ.. ఈ సేవలు పొందకుండా ఉండటానికి తామేం తప్పు చేశామని అడుగుతున్నారు. తమకూ వెంటనే ఇలాంటి ఆఫర్లు తీసుకురావాలని ఫ్లిప్ కార్టును కోరుతున్నారు.

Share post:

లేటెస్ట్