
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన సుంకాలు అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ ప్రభావంతో ఆసియా మార్కెట్లతో పాటు భారతీయ మార్కెట్లు (Indian Stock Markets) కూడా కుదేలవుతున్నాయి. దీంతో వాణిజ్య యుద్ధం మొదలవుతుందన్న భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి క్లిష్ట సమయంలో బంగారమే పెట్టుబడికి అసలైన సాధనం అని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. మరోవైపు వాణిజ్య యుద్ధం, ఆర్థిక మాంధ్యం భయాలతో ప్రపంచ దేశాల బ్యాంకులు కూడా బంగారాన్ని పెట్టుపడి సాధనంగా చూస్తున్నారు.
మళ్లీ పెరిగిన పసిడి రేట్లు
ఈ నేపథ్యంలోనే పసిడి (Gold Rates Today)కి భారీగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు అమాంతం ఆకాశాన్నంటన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. మంగళవారం రోజున అకస్మాత్తుగా పడిపోయింది. మొన్నటి దాకా రూ.90,000కు పైగా పలికిన తులం గోల్డ్ రేటు మంగళవారం నాడు రూ.89000 వరకు వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే 10 గ్రాముల పసిడి త్వరలోనే రూ.50000 వరకు తగ్గుతుందని అంతా భావించారు. కానీ బుధవారం ఉదయం నాటికి మళ్లీ పుత్తడి రేటు పెరిగి అందరికీ షాక్ ఇచ్చింది.
తగ్గిన వెండి ధర
దేశవ్యాప్తంగా బుధవారం రోజున బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. మంగళవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ (Gold Price in Hyderabad) 10 గ్రాముల ధర ₹89,730 ఉండగా.. బుధవారం నాటికి ₹710 పెరిగి ప్రస్తుతం ₹90,440 వద్ద పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి తులం ధర మంగళవారం రోజున ₹82,250 ఉండగా బుధవారం ఉదయానికి ₹650 పెరిగి ₹82,900 వద్ద విక్రయిస్తున్నారు. ఇది మళ్లీ ఇలాగే కొనసాగితే బంగారం కొనుగోలు చేయడం అసాధ్యంగా మారుతుందని సామాన్యులు అంటున్నారు. మరోవైపు ఇవాళ వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర (Silver Price Today) మంగళవారం నాడు రూ.92,120 ఉండగా బుధవారం నాటికి రూ.182 తగ్గి రూ.91,938కు చేరుకుంది.