Ind vs Nz: కివీస్‌కు స్వల్ప టార్గెట్.. అద్భుతం జరిగేనా?

Mana Enadu: బెంగళూరు టెస్టులో టీమ్ఇండియా(Team India) ఓటమి అంచున నిలిచింది. ఇక చివరి రోజు అద్భుతం జరిగితే తప్ప భారత్ తొలి టెస్టు(1st Test)లో నెగ్గడం కష్టమే. చిన్నస్వామి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌(Second Innings)లో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (150) హిస్టారిక్ సెంచరీతో ఆదుకోగా, పంత్ 99, కోహ్లీ 70, రోహిత్ శర్మ 52 పరుగులతో మెరవడంతో టీమిండియా ఓటమి బారి నుంచి బయటపడిందనుకున్నారు. కానీ నాలుగో రోజు టీ విరామం తర్వాత భారత్ అనూహ్యంగా కుప్పకూలింది. ఓ దశలో 408/3తో పటిష్ఠంగా కనిపించిన భారత్.. చివరకు 462 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌(Kiwis)కు 107 పరుగుల స్వల్ప టార్గెట్‌(Target)ను నిర్దేశించింది.

 ప్చ్.. పంత్ సెంచరీ మిస్

కాగా ఈ మ్యాచ్ నాలుగో రోజు టీమ్ ఇండియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) కేవలం 1 పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. 99 పరుగులు చేసిన పంత్.. కివీస్ పేసర్ విలియం వేసిన బంతిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్(Clean bowled) అయ్యాడు. పంత్ ఔట్ కావడంతో స్టేడియం మొత్తం నిశబ్దమైంది. కాగా రేపు భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌ల బౌలింగ్‌పైనే రోహిత్ సేన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరి ఈ ముగ్గురు కివీస్ బ్యాటర్లను ఎంత వరకు నిలువరిస్తారో వేచి చూడాలి.

 అంపైర్లతో వాగ్వాదం

ఇదిలా ఉండగా 107 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్(New Zealand) నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా, పరుగు లేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. నిజానికి నాలుగో రోజుకు అరగంటకు పైగా సమయం ఉంది. కానీ వెలుతురు లేమీ(Bad Light) కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాలని అంపైర్ నిర్ణయించారు. దీంతో నిర్ణీత సమయానికి ముందే రోజు ముగిసింది. ఈ సమయంలో అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా మైదానంలో ఉన్న అంపైర్లతో టీమిండియా ఆటగాళ్లు కొంతసేపు వాగ్వాదానికి దిగారు. అయినా నాలుగోరోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

Share post:

లేటెస్ట్