Mana Enadu : రైలు ప్రయాణికులకు అలర్ట్. మీరు రైలు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా..? టికెట్ బుకింగ్ రూల్స్ మారాయని మీకు తెలుసా..? టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే (Indian Railways) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ముందస్తు రిజర్వేషన్ సమయాన్ని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది.
వచ్చే నెల నుంచే అమల్లోకి
ప్రస్తుతం ప్రయాణానికి 120 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకునే సదుపాయం ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీన్ని 60 రోజులకు కుదిస్తూ.. ఐఆర్‌సీటీసీ(IRTCTC Ticket Booking) నిబంధనల్లో మార్పులు చేసింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. అక్టోబర్ 31 వరకు రిజర్వేషన్ చేసుకునే వారికి పాత నిబంధనే వర్తిస్తుందని తెలిపాయి.
ఆ రైళ్లలో నో ఛేంజ్
మరోవైపు తాజ్ ఎక్స్‌ప్రెస్(Taj Express), గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల అడ్వాన్స్ డ్ బుకింగ్‌లో మాత్రం ఎలాంటి మార్పూ లేదని భారతీయ రైల్వే సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికే వాటిలో బుకింగ్ వ్యవధి తక్కువగా ఉందని పేర్కొంద్. విదేశీ పర్యటకులకు ఏడాది ముందుగానే అంటే 365 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు.
UTS యాప్ లో కీలక అప్డేట్
రైల్వే టికెట్ కౌంటర్ దగ్గర క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా జనరల్ టికెట్ బుకింగ్ కోసం రైల్వే శాఖ యూటీఎస్ (Un Reserved Ticketing System) అనే మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ యాప్ లో ఇప్పటివరకు జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కొన్ని జియో ఫెన్సింగ్ పరిమితులు ఉండగా.. తాజాగా రైల్వే శాఖ వాటిని తొలగించింది.